
ధోనీ రిటైర్ కావొద్దంటోన్న అభిమానగణం..
ఈ నేపథ్యంలో- ధోనీ మరి కొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడాలని అభిలాషించే వారి సంఖ్య కూడా నానాటికీ పెరిగిపోతూనే వస్తోంది. ఇదివరకు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మళింగ.. ధోనీ రిటైర్‌మెంట్ వార్తలపై స్పందించారు. ఇప్పుడిప్పుడే ధోనీ రిటైర్ కావడం ఎవరికీ ఇష్టం ఉండదని అన్నారు. తాను సైతం ఆయన మరి కొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నానని చెప్పారు. కనీసం రెండేళ్ల పాటు క్రికెట్ ఆడే సత్తా ధోనీకి ఉందని చెప్పుకొచ్చారు మళింగ. ఇదిలావుండగా- ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇప్పుడిప్పుడే తప్పుకోవడం సరికాదని అంటూ ఓ అనూహ్యమైన గళం వినిపించింది.
భారతరత్న లతా మంగేష్కర్ సైతం..
ఆ గళమే- లెజెండరీ గాయని లతా మంగేష్కర్. భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ సైతం ధోనీ రిటైర్‌మెంట్ వార్తలపై తన స్పందనను తెలియజేశారు. ఈ మేరకు ఆమె గురువారం ఓ ట్వీట్ చేశారు. ధోనీ గారూ! నమస్కారం..అని సంబోధిస్తూ లతా మంగేష్కర్ తన ట్వీట్‌ను ఆరంభించారు. లతా మంగేష్కర్ ట్వీట్ అంతా హిందీలో సాగంది. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు చెబుతారనే వార్తలను తాను కొద్దిరోజుల నుంచి వింటున్నానని ఆమె పేర్కొన్నారు. మరి కొన్నాళ్ల పాటు క్రికెట్ ఆడాల్సిన అవసరం ఈ దేశానికి ఉందని చెప్పారు. రిటైర్ కావాలనే ఆలోచన కూడా మనస్సులో రానీయ వద్దని తాను ఆశిస్తున్నానని చెప్పారు. మరి కొంతకాలం క్రికెట్ ఆడాలని కోరుకునే అభిమానుల్లో తానూ ఉన్నానని లతా మంగేష్కర్ చెప్పారు.

ఎందుకీ ఆలోచన..?
ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓటమి చవి చూసింది. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాక్ క్యాప్స్ మొత్తం 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు..ఆరంభం నుంచే వికెట్లను కోల్పోతూ వచ్చింది. మిడిలార్డర్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహేంద్రసింగ్ ధోనీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కొద్దిసేపు ప్రతిఘటించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయింది. ఓటమితో మ్యాచ్‌ను ముగించిన ధోనీ.. విషాదకర పరిస్థితుల్లో తన కేరీర్‌కు ముగింపు పలకకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications












