హైదరాబాద్: భారత్‌తో సిరిస్ ముగిశాక తన కెరీర్‌పై నిర్ణయం తీసుకుంటానని శ్రీలంక పేసర్ లసిత్ మలింగ అన్నాడు. కొలంబో వేదికగా జరిగిన నాలుగో వన్డేలో శ్రీలంక జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన మలింగ తన భవిష్యత్తుపై పునరాలోచనలో పడ్డాడు.
నాలుగో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ తీసి మలింగ మూడొందల వికెట్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో 11వ స్దానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో మలింగ 10 ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి 82 పరుగులిచ్చాడు.

మోకాలి గాయం కారణంగా 19 నెలలపాటు జట్టుకు దూరంగా ఉన్న మలింగ జూన్‌లో జట్టులోకి తిరిగొచ్చాడు. అప్పటి నుంచి 12 మ్యాచ్‌లు ఆడిన మలింగ 9 వికెట్లు తీశాడు. తాజా సిరీస్‌లో నాలుగు మ్యాచుల్లో మలింగ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.
మ్యాచ్ అనంతరం మలింగ మీడియాతో మాట్లాడాడు. 'తాను 19 నెలల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చా. జింబాబ్వే, ఇండియా సిరీస్‌లలో తాను ఉత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయా. ఈ సిరీస్ తర్వాత తానెక్కడ ఉండాలన్నది నిర్ణయించుకుంటా. ఎంతకాలం ఆడతానన్న విషయాన్ని మాత్రం చెప్పలేను' అని అన్నాడు.
తన వల్ల జట్టుకు ఉపయోగం లేనప్పుడు జట్టులో ఉండడం అర్థరహితమని మలింగ చెప్పుకొచ్చాడు. రాబోయే మూడు నాలుగు నెలల్లో తన భవిష్యత్తపై ఓ నిర్ణయం తీసుకుంటానని మలింగ అన్నాడు. మలింగ మాటలను బట్టి చూస్తుంటే భారత్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ ముగిసిన తర్వాత రిటైరవుతాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా, గురువారం జరిగిన వన్డేలో వన్డే కెరీర్‌లో 300 వికెట్లు తీసిన నాలుగో శ్రీలంక ఆటగాడిగా మలింగ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. వన్డేల్లో 300వ వికెట్‌ను సాధించడం ద్వారా తక్కువ మ్యాచ్‌ల్లో సాధించిన ఐదో బౌలర్‌గా మలింగ నిలిచాడు. 2004, జులై 17న వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన లసిత్ మలింగ 203 మ్యాచ్‌ల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
దీంతో పాకిస్థాన్‌కు చెందిన వసీం అక్రమ్(208)ను మలింగ వెనక్కు నెట్టాడు. వన్డేల్లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో మూడొందల వికెట్లను సాధించిన వారిలో బ్రెట్ లీ (171) తొలి స్థానంలో ఉండగా, వకార్ యూనిస్ (186) రెండో స్థానంలో ఉన్నారు. ఇక మెక్ గ్రాత్ (200), మురళీ ధరన్ (202)లు తర్వాతి స్థానాల్లో నిలిచారు.
ఈ మ్యాచ్‌లో మలింగ ఆఫ్‌సైడ్ వేసిన 29.3వ బంతిని కోహ్లీ స్వీపర్ కవర్ వైపు భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడే ఉన్న మునవీర దానిని ఒడిసిపట్టాడు. దీంతో 131 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్ కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు. ఇది వన్డేల్లో మలింగకు కెరీర్‌లో 300వ వికెట్.