హైదరాబాద్: కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో శ్రీలంక పేసర్ లసిత్ మలింగ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడం ద్వారా మలింగ తన కెరీర్‌లో 300వ వన్డే వికెట్‌ని సాధించాడు.
వన్డేల్లో 300వ వికెట్‌ను సాధించడం ద్వారా తక్కువ మ్యాచ్‌ల్లో సాధించిన ఐదో బౌలర్‌గా మలింగ నిలిచాడు. 2004, జులై 17న వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన లసిత్ మలింగ 203 మ్యాచ్‌ల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దీంతో పాకిస్థాన్‌కు చెందిన వసీం అక్రమ్(208)ను మలింగ వెనక్కు నెట్టాడు.

వన్డేల్లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో మూడొందల వికెట్లను సాధించిన వారిలో బ్రెట్ లీ (171) తొలి స్థానంలో ఉండగా, వకార్ యూనిస్ (186) రెండో స్థానంలో ఉన్నారు. ఇక మెక్ గ్రాత్ (200), మురళీ ధరన్ (202)లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ మ్యాచ్‌లో మలింగ ఆఫ్‌సైడ్ వేసిన 29.3వ బంతిని కోహ్లీ స్వీపర్ కవర్ వైపు భారీ షాట్ ఆడాడు.
అయితే అక్కడే ఉన్న మునవీర దానిని ఒడిసిపట్టాడు. దీంతో 131 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్ కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు. ఇది వన్డేల్లో మలింగకు కెరీర్‌లో 300వ వికెట్. ఈ సందర్భంగా క్రీజులో ఉన్న రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మలింగను అభినందించారు. ఈ ముగ్గురూ కూడా ఇండియన్ ప్రీమియిర్ లీగ్ (ఐపీఎల్) ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతుండటం విశేషం.