హైదరాబాద్: శ్రీలంక జట్టు వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ సనత్ జయసూర్య నేతృత్వంలోని శ్రీలంక క్రికెట్ సెలక్షన్ కమిటీ సభ్యులు తమ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేశారు. భారత్‌తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లు కోల్పోవడం, అంతకు ముందు జింబాంబ్వేతో ఘోర పరాజయం, ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలోనే ఇంటికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు చీఫ్ సెలెక్టర్ జయ సూర్యతో పాటు కమిటీ సభ్యులు రంజిత్ మదురసింఘే, రమేష్ కలువితరణ, అసంక గురుసిన్హా, ఎరిక్ ఉపషంతలతో కూడిన సెలక్షన్ ప్యానెల్ భారత్‌తో జరిగే ఎకైక టీ20 అనంతరం తప్పుకోనున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ మోహన్ సిల్వా తెలిపారు.

వీరి రాజీనామాల్ని శ్రీలంక బోర్డు ఆమోదించాల్సి ఉంది. ఈ సెలెక్షన్ కమిటీ పదవీకాలం మే నెలలోనే ముగిసింది. కానీ మరో 6నెలల పొడిగింపు ఇచ్చారు. మరోవైపు, ఈ సెలక్షన్ కమిటీ రాజీనామా లేఖ అందించిందని శ్రీలంక క్రీడా శాఖ మంత్రి దయాశ్రీ జయశేకర ధృవీకరించారు.
భారత పర్యటన ముగిసే వరకు సెలెక్షన్ కమిటీని కొనసాగించనున్నట్టు సమాచారం. సెప్టెంబర్ 6న భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే ఏకైక టీ20తో ఈ సిరిస్ ముగుస్తుంది. దిగ్గజ ఆటగాళ్లు కుమార సంగక్కర, మహిళా జయవర్ధనే, తిలకరత్నే దిల్షాన్, ముత్తయ్య మురళిధరన్‌ల వీడ్కోలు తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది.
ఐదు వన్డేల సిరిస్‌లో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. దీంతో లంక క్రికెట్ బోర్డు సంక్షోభంలో పడింది.