Lalit Modi: 2008లో జరిగిన మొదటి ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం హర్భజన్ సింగ్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌ను చెంపపై కొట్టడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ సంఘటన కారణంగా హర్భజన్ సింగ్‌పై 11 మ్యాచ్ ల నిషేధం కూడా విధించారు.
17 ఏళ్ల తర్వాత వీడియో విడుదల.. వివాదం మళ్లీ మొదలు
ఇటీవల లలిత్ మోడీ, ఆస్ట్రేలియా క్రికెటర్ మైఖేల్ క్లార్క్‌తో జరిపిన ఒక చర్చలో ఈ సంఘటన గురించి ప్రస్తావించారు. అంతే కాకుండా అప్పటి వరకు బయటకు రాని ఆ వివాదాస్పద వీడియోను కూడా విడుదల చేశారు. ఈ చర్య క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ వీడియో విడుదల తర్వాత.. శ్రీశాంత్ భార్య భువనేశ్వరి తీవ్రంగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో లలిత్ మోడీ, మైఖేల్ క్లార్క్‌లను ఆమె తీవ్రంగా విమర్శించారు.

"17 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటనను మీ చవకబారు ప్రచారం కోసం మళ్లీ ఎందుకు బయటికి తీస్తున్నారు? హర్భజన్, శ్రీశాంత్ ఎప్పుడో ఆ సంఘటనను మరిచిపోయారు. ఇప్పుడు వారు తమ జీవితాల్లో స్థిరపడి, పిల్లలకు తండ్రులుగా ఉన్నారు. వారి పాత గాయాలను మళ్లీ రేపడం చాలా క్రూరంగా ఉంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. వారి చర్యల వల్ల అమాయక పిల్లలు ఇతరుల ప్రశ్నలకు, అవమానాలకు గురికావాల్సి వస్తుందని, ఇది ఇతరుల కుటుంబాలను వేదనలో పడేస్తుందని ఆమె అన్నారు.
లలిత్ మోదీ కూల్ రిప్లై.. మంటలో నూనె పోసినట్లు..
భువనేశ్వరి ఆరోపణలకు లలిత్ మోడీ ఇచ్చిన సమాధానం మరింత వివాదాన్ని రేపింది. "ఆమె ఎందుకు కోపపడుతున్నారో నాకు తెలియదు. నన్ను క్లార్క్ ఒక ప్రశ్న అడిగారు, నేను నిజం చెప్పాను. నేను ఎప్పుడూ నిజమే చెప్పడానికి ఇష్టపడతాను. ఆ సంఘటనలో శ్రీశాంత్ బాధితుడు కాబట్టి నేను అలా చెప్పాను" అని ఆయన అన్నారు.
ఈ వివరణతో పాత వివాదాన్ని మళ్లీ లేపడమే కాకుండా.. సంబంధిత కుటుంబాలను వేదనలో పడేసినందుకు పశ్చాత్తాపం లేదని లలిత్ మోదీ చెప్పినట్లుగా అనిపించింది. పాత గాయాలను మళ్లీ రేపి, ఈ సంఘటనతో సంబంధం లేని అమాయక పిల్లలను ఇబ్బంది పెడుతున్నందుకు భువనేశ్వరి పడిన వేదనను లలిత్ మోదీ పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన క్రికెట్ అభిమానుల మధ్య మళ్లీ తీవ్ర చర్కకు దారి తీసింది.