2030 నాటికి ఆ ఆటగాడి ధర రూ.150 కోట్లు! దెబ్బకు లైఫ్ సెటిల్!!
ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ అధ్యక్షుడు లలిత్ మోదీ మరోసారి తన కామెంట్లతో వార్తల్లో నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్.. భవిష్యత్తులో మరింత భారీగా విస్తరించబోతోందని ఆయన అంచనా వేశారు. 2030 నాటికి ఐపీఎల్ ఆర్థిక ముఖచిత్రం ఊహించని రీతిలో మారుతుందని.. ప్లేయర్లపై కాసుల వర్షం కురుస్తుందని లలిత్ మోదీ ధీమా వ్యక్తం చేశారు.
రాకెట్ వేగంతో పెరగనున్న ప్లేయర్ల ధర
లలిత్ మోదీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాబోయే నాలుగేళ్లలో ఐపీఎల్ జట్ల బడ్జెట్ ఏకంగా 7 రెట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక్కో ఫ్రాంచైజీకి ఉన్న రూ. 125 కోట్ల బడ్జెట్ (పర్స్ వాల్యూ).. 2030 నాటికి సుమారు 100 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 932 కోట్లు) చేరుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. దీనివల్ల ప్రపంచంలోని మేటి ఆటగాళ్లు ఒక్కో సీజన్‌కు ఏకంగా రూ. 150 కోట్ల వరకు సంపాదించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.

ఒక్క మ్యాచ్‌కే రూ. 9 కోట్లు!
'ద ఓవర్‌లాప్ క్రికెట్'తో మాట్లాడిన లలిత్ మోదీ.. భవిష్యత్తులో ఆటగాళ్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని విశ్లేషించారు. టాప్ ప్లేయర్లు ఆడే ఒక్కో మ్యాచ్ విలువ సుమారు 1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8.5 నుండి 9 కోట్లు) ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ (రూ. 27 కోట్లు - లక్నో సూపర్ జెయింట్స్) నిలవగా.. లలిత్ మోదీ అంచనా ప్రకారం భవిష్యత్తులో ఈ రికార్డులు ఎక్కడికో చేరుకుంటాయి.
యువ ఆటగాళ్లకు లక్కీ ఛాన్స్:
ఒకవేళ లలిత్ మోదీ అంచనాలు నిజమైతే, వైభవ్ సూర్యవంశీ, జాకబ్ బెథెల్ వంటి యువ ఆటగాళ్లకు అది గొప్ప వరంగా మారనుంది. దీర్ఘకాలం పాటు లీగ్‌లో కొనసాగే అవకాశం ఉన్న యంగ్ టాలెంట్‌కు కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. కేవలం స్టార్ ప్లేయర్లు మాత్రమే కాకుండ.. సాధారణ ఆటగాళ్లు కూడా ప్రతి మ్యాచ్‌కూ కోట్ల రూపాయలు ఆర్జించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు పెరుగుతున్న క్రేజ్, విపరీతమైన పోటీనే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
కుదేలైన ముంబై ఇండియన్స్.. వరుసగా నాలుగో ఓటమి
ఓ వైపు భవిష్యత్తులో కోట్ల రూపాయల ఆదాయం గురించి చర్చ జరుగుతుండగా.. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ మైదానంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. క్వింటన్ డికాక్ అద్భుత సెంచరీ (112 నాటౌట్), నమన్ ధీర్ (50) మెరుపులు ముంబైని కాపాడలేకపోయాయి.
పంజాబ్ బ్యాటర్ల విధ్వంసం.. వాంఖడేలో పరుగుల వరద
ముంబై నిర్దేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు చాలా సులువుగా ఛేదించారు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ కేవలం 31 బంతుల్లో 80 పరుగులు (11 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ముంబై బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ 35 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. వీరిద్దరి మధ్య నెలకొన్న 139 పరుగుల భాగస్వామ్యం పంజాబ్ విజయాన్ని సులభతరం చేసింది.
తేలిపోయిన బుమ్రా.. ముంబై బౌలింగ్ వైఫల్యం
ముంబై ఇండియన్స్ ఓటమికి ప్రధాన కారణం వారి బౌలింగ్ విభాగం వైఫల్యమే. ఆ జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి వికెట్ తీయలేకపోగా.. 4 ఓవర్లలో ఏకంగా 41 పరుగులు సమర్పించుకున్నాడు. పంజాబ్ జట్టు 196 పరుగుల లక్ష్యాన్ని మరో 21 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. అల్లా గజన్‌ఫర్ (2/31) మినహా ముంబై బౌలర్లలో ఎవరూ పంజాబ్ బ్యాటర్లను కనీసం ఇబ్బంది కూడా పెట్టలేకపోయారు. ముంబై జట్టు తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తక్షణమే పుంజుకోవాల్సిన అవసరం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications