లండన్: కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ బ్రిటన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ.. బ్రిటిష్ యువరాజు చార్లెస్ నేతృత్వంలోని ఓ స్వచ్ఛంద సంస్థకు భారీగా విరాళం ఇచ్చినట్లు వెల్లడైంది.
దేశంలో ప్రస్తుతం రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారిన లలిత్ మోడీ, భారత్‌లో ఏనుగుల రక్షణ కోసం చార్లెస్ నడుపుతున్న ఎలిఫెంట్ ఫ్యామిలీ ఛారిటీకి రూ.19,12,058 (30 వేల అమెరికన్ డాలర్లు) విరాళం ఇచ్చినట్లు 'ది సండే టైమ్స్' పత్రిక కథనం వెల్లడించింది.

చార్లెస్, ఆయన భార్య కెమిల్లా సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్న ఈ సంస్థను కెమిల్లా దివంగత సోదరుడు మార్క్‌షాండ్ స్థాపించారు. షాండ్.. 2013, ఫిబ్రవరిలో న్యూయార్క్‌లో మృతి చెందారు.
కాగా, ముఖ్యంగా ఈశాన్య భారతంలో ఏనుగుల సంరక్షణకు కృషి చేస్తున్న ఈ సంస్థకు 2011 అక్టోబర్‌లో లలిత్ మోడీ ఈ భారీ విరాళం అందజేసినట్లు సండే టైమ్స్ వెల్లడించింది. తనపై నిరాధారమైన ఆరోపణలు రాజకీయ ప్రోద్బలంతోనే వస్తున్నాయని లలిత్ మోడీ తన న్యాయవాది ద్వారా తెలిపారు.