
హైదరాబాద్: టీమిండియా మాజీ కోచ్ రాజ్‌పుత్ జింబాబ్వే క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ మేరకు గురువారం ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్‌కు జింబాబ్వే జట్టు అర్హత సాధించకపోవడంతో అంతకముందు కోచ్‌గా ఉన్న హీత్‌స్ట్రీక్‌ను తప్పించారు.
హీత్‌స్ట్రీక్ స్థానంలో రాజ్‌పుత్‌ను నియమిస్తున్నట్టు జింబాబ్వే క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా లాల్‌చంద్ రాజ్‌పుత్ మాట్లాడుతూ 'రెండు రోజుల క్రితం వాళ్లు నాతో మాట్లాడారు. జింబాబ్వే క్రికెట్ బాధ్యతలు చేపట్టాలని కోరారు. ఇది నాకొక మంచి అవకాశంగా భావిస్తున్నా' అని రాజ్‌పుత్ తెలిపాడు.
2007లో దక్షిణాఫ్రిలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న భారత్ జట్టుకు రాజ్‌పుత్ టీమ్ మేనేజర్‌గా వ్యవహరించాడు. రాజ్‌పుత్ కోచ్‌గా జూలైలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లతో జరిగే ముక్కోణపు టీ20 సిరిస్‌లో ఆ జట్టు తలపడనుంది. భారత్ తరపున 2 టెస్ట్‌లు, 4 వన్డేలు ఆడిన రాజ్‌పుత్ 2016లో ఆఫ్ఘనిస్థాన్ కోచ్‌గా పనిచేశాడు.