స్టార్ బ్యాట్స్‌మన్‌కు తీవ్ర గాయం.. పెదాలపై ఏకంగా ఏడు కుట్లు! ఇక ఆడడం డౌటే!

అబుదాబీ: క్రికెట్ ఆటలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఆటగాళ్లు తరచుగా గాయాల పాలవుతుంటారు. ప్లేయర్స్ కొన్నిసార్లు చిన్న చిన్న గాయాలతో బయటపడితే.. మరికొన్ని సార్లు ఏకంగా ప్రాణాలే కోల్పోతుంటారు. ఓ రాకాసి బౌన్సర్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. ఆపై చాలా మంది ఆటగాళ్లు కూడా తృటిలో పెద్దపెద్ద ప్రమాదాల నుంచి బయటపడ్డారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ బెన్ డంక్ కూడా పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బంతి నేరుగా అతని మూతికి తగలడంతో భారీ గాయమైంది. వెంటనే మైదానాన్ని వీడిన డంక్.. ఆ తర్వాత కుట్లు వేయించుకున్నాడు.

ప్రాక్టీస్ చేస్తుండగా:
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ఆరవ సీజన్ బుధవారం (జూన్ 9న) పునఃప్రారంభం కానుంది. ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ అయిన బెన్ డంక్ ప్రస్తుతం పీఎస్‌ఎల్ కోసం అబుదాబీలో ఉన్నాడు. లాహోర్ ఖలందర్స్ జట్టు తరపున డంక్ ఆడుతున్నాడు. బుధవారం లీగ్ ప్రారంభం కానుండడంతో డంక్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఆదివారం క్యాచ్‌లు అందుకోవడాన్ని ప్రాక్టీస్ చేస్తుండగా.. ఓ క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేరుగా అతడి మూతికి తగిలింది. పెదవులు చిట్లి పోయి తీవ్ర రక్తస్రావమైంది. గాయపడిన అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్లు సర్జరీ చేసి 7 కుట్లు వేసి పెదవిని తిరిగి యథాస్థానంలో అతికించారు. డంక్ ఈ సీజన్ మ్యాచులు ఆడే అవకాశాలు దాదాపు లేనట్టే.

సర్జన్‌లకు ధన్యవాదాలు:
సర్జరీ అనంతరం బెన్ డంక్ స్వయంగా విషయాన్ని వెల్లడించాడు. 'ప్రాక్టీస్ చేస్తుండగా నా పెదాలకు తీవ్ర గాయమైంది. నా పెదవిని తిరిగి యథాస్థానంలో అమర్చిన బుర్జీల్ హాస్పిటల్‌లోని నర్సులు మరియు సర్జన్‌లకు ధన్యవాదాలు' అని బెన్ డంక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. లాహోర్ ఖలందర్స్ జట్టులో డంక్ కీలక ఆటగాడు కావడంతో జట్టు విజయావకాశాలపై ప్రభావం పడనుందని ఆ ఫ్రాంఛైజీ సీఈఓ సమిన్ రానా పేర్కొన్నాడు. పీఎస్‌ఎల్ 2021 తొలి భాగంలో డంక్.. 40 సగటుతో 80 పరుగులు సాధించి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగలతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
మూడో స్థానంలో లాహోర్:
పీఎస్‌ఎల్ 2021లో ప్రస్తుతం లాహోర్ ఖలందర్స్ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. లాహోర్ జట్టులో పాకిస్తాన్ స్టార్ ఆటగాళ్లు షాహీన్ అఫ్రిది, ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, హరిస్ రౌఫ్‌తో పాటు విదేశీ స్టార్లు రషీద్ ఖాన్, డేవిడ్ వీజ్, సమిత్ పటేల్ ఉన్నారు. బెన్ డంక్ ఆస్ట్రేలియా తరఫున ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 34 ఏళ్ల డంక్.. 2014 నవంబర్‌లో తొలిసారిగా ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. కరోనా కారణంగా వాయిదా పడిన పీఎస్‌ఎల్ 2021 యూఏఈ వేదికగా జూన్ 9 నుంచి పునఃప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications