
38 పరుగులు.. మూడు వికెట్లు:
అరంగేట్ర టెస్టులోనే కైలీ జెమీసన్ సత్తా చాటాడు. 14 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, నయావాల్ చటేశ్వర్ పుజారా, హనుమ విహారిని ఔట్ చేశాడు. కీలక వికెట్లతో పాటు ఓ అద్భుత క్యాచ్ కూడా పట్టాడు. ఇక విరాట్ కోహ్లీకి జెమీసన్ వేసిన బంతి అద్భుతం. ఆ బంతి కోహ్లీ బ్యాట్ అంచును తాకి స్లిప్ ఫీల్డర్ రాస్ టేలర్ చేతుల్లో పడింది. ఇక జెమీసన్ సంతోషానికి వదుల్లేకుండా పోయాయి.

ఇప్పటికీ నమ్మలేకపోతున్నా:
మ్యాచ్ అనంతరం జెమీసన్ మాట్లాడుతూ... 'ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీ టాప్ బ్యాట్స్‌మన్. ఎక్కడైనా పరుగులు చేయగలడు. అలాంటి కోహ్లీ వికెట్ తీయడాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. చాలా సంతోషంగా ఉంది. కోహ్లీ విక్కెట్ తీయాలని ప్రతి ఒక్క బౌలర్ అనుకుంటాడు. కానీ.. అదేమంత సులభం కాదు. అదృష్టంగా ఈ రోజు ముందుగానే కోహ్లీ నాకు చిక్కాడు. కోహ్లీ, పుజారా వికెట్లను ఆరంభంలోనే తీయడంతో ఎమోషన్ అయ్యా. ఈ సందర్భం చాలా ప్రత్యేకమైనది' అని అన్నాడు.

నా హైట్ పనికొచ్చింది:
'మా (న్యూజిలాండ్) జట్టు మంచి స్థితిలో నిలవడంతో నా పాత్ర ఉన్నందుకు ఆనందం వేసింది. ప్రణాళికలకు కట్టుబడి బౌలింగ్ చేశా. సరైన ప్రదేశాల్లో బంతులు విసిరి తగిన ఫలితాన్ని రాబట్టా. ఓవర్‌కాస్ట్ కండీషన్‌కు అనుకూలంగా బౌలింగ్ చేయడంతో సానుకూల ఫలితాలు వచ్చాయి. గత కొన్ని వారాలుగా సరళంగా ఉంచడానికి ప్రయత్నించా. నా పాత్ర ఏమిటో తెలుసుకున్నా. పేస్, బౌన్స్, స్వింగ్, సీమ్‌లు నాకు వికెట్లు తీయడానికి దోహదం చేసాయి. బౌలింగ్ చేసేటప్పుడు నా హైట్ కూడా ఉపకరించింది' అని జెమీసన్ పేర్కొన్నాడు.

చెలరేగిన జెమీసన్:
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజుకి వరుణుడు అడ్డుపడ్డాడు. టీ బ్రేక్ తర్వాత వర్షం కురుస్తుండడంతో మ్యాచ్‌కి అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం భారత్ ఐదు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేయగా.. క్రీజులో రిషబ్ పంత్ (10 నాటౌట్), అజింక్య రహానే ఉన్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓవర్‌కాస్ట్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న కివీస్ బౌలర్లు చెలరేగారు. పృథ్వీ షా (16), చటేశ్వర్ పుజారా (11), కెప్టెన్ విరాట్ కోహ్లీ (2), హనుమ విహారి (7) వరుసగా పెవిలియన్ చేరారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (34) కాస్త ఫర్వాలేదనిపించాడు.

కోల్‌కతాలో చివరి సెంచరీ:
వన్డేల్లో 43 సెంచరీలు, టెస్టుల్లో 27 శతకాలతో మొత్తంగా అంతర్జాతీయ కెరీర్‌లో 70 శతకాలు సాధించిన కోహ్లీ ఇటీవల కాలంలో దారుణంగా విఫలమవుతున్నాడు. గతేడాది నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో చివరిసారి సెంచరీ సాధించగా.. ఇప్పటివరకూ శతకాన్ని ఖాతాలో వేసుకోలేదు. న్యూజిలాండ్‌తో శుక్రవారం ఆరంభమైన తొలి టెస్టులో కోహ్లీ మొదటి ఇన్నింగ్స్‌లో 2 పరుగులు మాత్రమే చేసాడు.


Click it and Unblock the Notifications












