
దుబాయ్: ఐపీఎల్-13వ సీజన్‌లో గురువారం మరో ఆసక్తికర సమరం జరగనుంది. దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మరో 20 మినిషాల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత జట్టుతోనే బెంగళూరు బరిలోకి దిగుతోంది. మరోవైపు పంజాబ్ రెండు మార్పులు చేసింది. జిమ్మీ నీశమ్ జట్టులోకి వచ్చాడు. గత మ్యాచ్‌లో నికోలస్ పూరన్ విఫలమవడంతో.. ఈ పోరులో క్రిస్ గేల్‌కు అవకాశం వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. పూరన్‌పైనే రాహుల్ నమ్మకముంచాడు.
తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచిన ఉత్సాహంతో బెంగళూరు బరిలో దిగుతుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో విఫలమైన పంజాబ్ ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలని చూస్తోంది. కోహ్లీసేన మంచి ఊపు మీద కనిపిస్తుండగా.. గెలుపు తీరాలకు వెళ్లి ఓటమిని ఎదుర్కొన్న రాహుల్ బృందం మంచి కసి మీదుంది. ఇరు జట్లలో హిట్టర్లకు కొదవ లేకపోవడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ పోరు విరాట్ కోహ్లీ వర్సెస్ కేఎల్ రాహుల్‌గా ఉంటుందని భావిస్తున్నారు.
ఇప్పటి వరకూ బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య 24 మ్యాచ్‌లు జరిగాయి. అందులో చెరో 12 విజయాలు సాధించాయి. అయితే చివరగా జరిగిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో బెంగళూరుదే పైచేయి. 2014లో దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. రెండు జట్ల అత్యధిక స్కోరు చూస్తే.. పంజాబ్ 232 పరుగులు చేయగా, బెంగళూరు 226 పరుగులు చేసింది. హైదరాబాద్, బెంగళూరు ఆడిన దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు మ్యాచ్ జరగనుంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది.
తుది జట్లు:
బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఆరోన్ ఫించ్, దేవ్‌దత్ పడిక్కల్, ఏబీ డివిలియర్స్, జోష్ ఫిలిప్ప్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివం దూబె, నవదీప్ సైనీ, ఉమేశ్‌యాదవ్, డేల్ స్టెయిన్, యుజ్వేంద్ర చహల్.
పంజాబ్: లోకేశ్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, నికోలస్ పూరన్, సర్ఫరాజ్ ఖాన్, గ్లెన్ మాక్స్‌వెల్, జిమ్మీ నీశమ్, షెల్డన్ కాట్రెల్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ.