
అబుదాబి: ముంబై ఇండియన్స్ కెప్టెన్ 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మను మరో అరుదైన రికార్డు ఊరిస్తున్నది. గురువారం ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలోనే రోహిత్ మరో రికార్డుపై కన్నేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో 5వేల పరుగుల మైలురాయి చేరేందుకు రోహిత్ రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకూ ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, సురేశ్ రైనాలు మాత్రమే ఉండగా.. ఆ తర్వాత స్థానంలో నిలిచేందుకు రోహిత్‌కు రెండు పరుగులు అవసరం.
ఇప్పటివరకూ 4,998 ఐపీఎల్ పరుగులు చేసిన రోహిత్ శర్మ.. మరో రెండు పరుగులు చేస్తే ఐదు వేల మార్కును చేరతాడు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ 5,430 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. సురేష్ రైనా 5,368 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో రోహిత్ కేవలం రెండు పరుగులు చేస్తే ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు.
విరాట్ కోహ్లీ 180 మ్యాచ్‌ల్లో 5 వేల పరుగులు సాధించగా.. సురేష్ రైనా 193 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. కోహ్లీ 37.12 సగటుతో 5,430 పరుగులు చేశాడు. మరోవైపు రైనా 193 మ్యాచ్‌ల్లో 33.34 సగటుతో 5,368 పరుగులు రాబట్టాడు. వ్యక్తిగత కారణాలతో ప్రస్తుత సీజన్ నుంచి రైనా తప్పుకున్న విషయం తెలిసిందే. కాగా రోహిత్ శర్మ ఇప్పటివరకూ 191 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ కెరీర్‌లో రోహిత్ ఒక సెంచరీతో పాటు 37 హాఫ్ సెంచరీలు సాధించాడు. పంజాబ్ జట్టుపై 600 పరుగుల మార్క్ చేరుకోవడానికి రోహిత్‌కు మరో 10 పరుగులు మాత్రమే అవసరం. ఫామ్‌లో ఉన్న పంజాబ్ బౌలింగ్ బౌలర్లను ఎదుర్కొని హిట్‌మ్యాన్ ఎలా ఆడతాడో చూడాలి.
ఐపీఎల్ 2020లో భాగంగా బెంగళూరుతో జరిగిన గత మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఎనిమిది పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. ఇరుజట్లు 201 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దాంతో సూపర్ ఓవర్ అనివార్యమైన మ్యాచ్‌లో ముంబై ఏడు పరుగులు చేయగా, ఆర్సీబీ దాన్ని ఛేదించి విజయం సాధించింది.