
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో రోహిత్ 5000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. గురువారం ముంబై ఇండియన్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్‌లో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించిన రోహిత్.. 5 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు.
13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సురేశ్ రైనా మాత్రమే 5 వేల పరుగుల క్లబ్‌లో ఉండగా.. తాజాగా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. విరాట్ 180 మ్యాచ్‌ల్లో 37.12 సగటుతో 5,430 పరుగులు చేయగా.. రైనా 193 మ్యాచ్‌ల్లో 33.34 సగటుతో 5,368 పరుగులు బాదాడు. 5 వేల పరుగులు పూర్తి చేయడానికి రోహిత్ 173 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన 10వ పరుగు సాధించగానే.. పంజాబ్ జట్టుపై 600 పరుగుల మార్కును చేరుకున్నాడు. రోహిత్ శర్మ 600 ఐపీఎల్ పరుగులు చేసిన ఐదవ ఐపీఎల్ జట్టు పంజాబ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు నాలుగు ట్రోఫీలు అందించిన అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్న రోహిత్.. ఐపీఎల్ లెజెండ్‌గా రికార్డ్ బుక్స్‌లో పొందుపరచడం ఖాయం.
ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకూ 3 మ్యాచులు ఆడింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 12 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 80 పరుగులు బాదాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 8 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టుపై ఇప్పటికే హాఫ్ సెంచరీ బాదాడు. 40 బంతుల్లో 53 రన్స్ చేశాడు.