
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13 సీజన్‌లో భాగంగా గురువారం మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో పంజాబ్ బరిలోకి దిగుతోంది. ఎం అశ్విన్ స్థానంలో కృష్ణప్ప గౌతమ్ తుది జట్టులోకి వచ్చాడు.మరోవైపు ముంబై ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నది.
పంజాబ్, ముంబై జట్లు గెలవాల్సిన మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఓటమిని ఎదుర్కొన్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పోరులో ముంబై ఇండియన్స్ సూపర్ ఓవర్లో ఓడింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో పంజాబ్ పరాజం పాలైంది. రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో కిందకు పడిపోయాయి. అయితే ప్రస్తుత ఫామ్ చూస్తే ముంబై ఈ మ్యాచ్‌లో ఫేవరెట్ అని చెప్పొచ్చు. పాయింట్ల పట్టికలో పంజాబ్ జట్టు ఐదో స్థానంలో, ముంబై జట్టు ఆరో స్థానంలో ఉండటం గమనార్హం. ఇరు జట్లు చెరో మూడు మ్యాచ్‌లు ఆడి.. చెరో మ్యాచ్‌లో గెలిచాయి.
రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో 5 వేల పరుగుల మార్కును చేరేందుకు రోహిత్ స్వల్ప దూరంలో నిలిచాడు. ఇప్పటివరకూ ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, సురేశ్ రైనాలు మాత్రమే ఉండగా.. ఆ తర్వాత స్థానంలో నిలిచేందుకు రోహిత్‌కు రెండు పరుగులు అవసరం. ఇప్పటివరకూ 4,998 ఐపీఎల్ పరుగులు చేసిన రోహిత్.. మరో రెండు పరుగులు చేస్తే ఐదు వేల మార్కును చేరతాడు.
తుది జట్లు:
పంజాబ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్‌వెల్, జేమ్స్ నీషమ్, కరున్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, షెల్డన్ కాట్రెల్, మహ్మద్ షమీ.
ముంబై: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జేమ్స్ పాటిన్‌సన్, రాహుల్ చహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా