
అబుదాబి: ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాస విజయం సాధించింది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ 157/8 పరుగులు చేయగా.. తర్వాత కింగ్స్ పంజాబ్ కూడా అన్నే పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టైగా మారి.. సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో పంజాబ్ రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో ఢిల్లీ మూడు పరుగులు చేసి ఈ సీజన్‌లో తొలి విజయం నమోదు చేసింది.
ఓటమిపై కింగ్స్ పంజాబ్ హెడ్‌కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ... 'ఈ ఓటమి చాలా నిరాశ కల్గించింది. మ్యాచ్ ఆసాంతం ఆకట్టుకుని చివరకు ఇలా ఓటమి పాలుకావడం బాధించింది. మేము మ్యాచ్ గెలవాల్సింది. కానీ చేజేతులా చేసుకున్నాం. ఇది నిజంగా దురదృష్టమే. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసినప‍్పుడు కనీసం 10-12 పరుగులు చేస్తే బాగుండేది. కానీ అలా జరగలేదు. ఢిల్లీ ఓటమి అంచుల నుంచి గెలుపును అందుకుంది. ఢిల్లీని అభినందించి తీరాలి. ఇది మాకు మొదటి మ్యాచ్ కాబట్టి చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాలి. మొత్తంగా మా ఆట బాగుంది. వచ్చే మ్యాచ్‌నాటికి అన్నీ సర్దుకుంటాయని ఆశిస్తున్నా' అని అన్నారు.
ఐసీసీ రూల్స్ ప్రకారం సూపర్ ఓవర్‌లో ఏ జట్టైనా రెండు వికెట్లు కోల్పోతే.. అక్కడితో వారి ఇన్నింగ్స్ ముగుస్తుంది. ఢిల్లీ తరఫున కాగిసో రబాడ వేసిన సూపర్ ఓవర్ తొలి బంతిని కింగ్స్ పంజాబ్ ఆటగాడు లోకేష్ రాహుల్ ఎదుర్కొని.. రెండు పరుగులు చేశాడు. రెండో బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. రెండో బంతికి నికోలస్ పూరం బోల్డ్ అయి పెవిలియన్ చేరాడు. దీంతో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. సూపర్ ఓవర్‌లో ఒక జట్టు 3 పరుగులే నిర్దేశించిన సందర్భాలు చాలా అరుదు. దాంతో కింగ్స్ ఓటమి ముందే డిసైడ్ అయిపోయింది. ఆపై మొహమ్మద్ షమీ సూపర్ ఓవర్ వేయగా.. రెండు బంతుల్లోనే ఢిల్లీ విజయాన్ని అందుకుంది.
ఛేదనలో పంజాబ్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ (89; 60 బంతుల్లో 4x7, 6x4) అద్భుత పోరాటం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మయాంక్ క్రీజులో నిలబడ్డాడు. అతడికి కృష్ణప్ప గౌతమ్ (20), క్రీస్ జోర్డాన్ (5) అండగా నిలవడంతో మ్యాచ్‌ను గెలిపించేంత పనిచేశాడు. అయితే స్టోయినిస్ వేసిన చివరి ఓవర్‌లో విజయానికి ఒక్క పరుగు అవసరమైన స్థితిలో మయాంక్ భారీ షాట్ ఆడి హెట్‌మెయిర్ చేతికి చిక్కాడు. ఇంకా పంజాబ్ విజయానికి ఒక్క బంతిలో ఒక పరుగు చేయాలి. కానీ స్టోయినిస్ చివరి బంతికి కూడా జోర్డాన్‌ను ఔట్ చేయడంతో మ్యాచ్ టై అయింది.
అంతకుముందు మార్కస్ స్టోయినిస్ (53; 21 బంతుల్లో 7x4, 3x6) చివరి రెండు ఓవర్లలో విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో ఢిల్లీ 157/8 స్కోర్ చేసింది. ఆదిలోనే మహ్మద్ షమి దెబ్బకు పృథ్వీ షా (5), శిఖర్ ధావన్ (0), షిమ్రన్ హెట్‌మెయిర్ (7) వెనుదిరిగినా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (39; 32 బంతుల్లో 3x6), రిషభ్ పంత్ (31; 29 బంతుల్లో 4x4) ఆదుకున్నారు. ఆపై వారిద్దరు స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ వరుస బౌండరీలతో అలరించాడు. అతడు కేవలం 20 బంతుల్లో అర్ధ శతకం సాధించడం విశేషం.