
హైదరాబాద్: దక్షిణాఫ్రికా గడ్డపై భారత మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశారని పాకిస్థాన్ స్పిన్నర్ మహ్మద్ హఫీజ్ ప్రశంసించాడు. సఫారీలపై జరిగిన ప్రతి సిరీస్ లోనూ మెరుపు ప్రదర్శన చేయడంతో వీరిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇటీవల ముగిసిన ఆరు వన్డేల సిరీస్‌లో ఈ స్పిన్ జోడి 33 వికెట్లు పడగొట్టి సఫారీ బ్యాట్స్‌మెన్‌కి తలనొప్పిగా మారడంతో.. భారత్ అలవోకగా సిరీస్‌ని 5-1తో చేజిక్కించుకుంది.
గతేడాది శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో భారత జట్టు 5-0తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అదే ఫలితాలను పునరావృతం చేయడానికే భారత జట్టు ఈ మణికట్టు స్పిన్ ద్వయాన్ని తీసుకు వచ్చిందంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. ఇదే కోవలోకి పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సైతం చేరిపోయాడు. లెగ్ స్పిన్ విసరడం ఏమంత సులువుకాదని.. బ్యాట్స్‌మెన్‌కి అర్థం కాకుండా బంతిని వేయడం చాలా కష్టమని ఈ పాకిస్థాన్ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఓ ప్రైవేట్ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో హఫీజ్ మాట్లాడాడు 'భారత జట్టులో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. పాకిస్థాన్ స్పిన్నర్ షదాబ్ ఖాన్ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. కానీ.. అతను ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. ప్రతి జట్టులోనూ ఓ లెగ్ స్పిన్నర్ తప్పకుండా ఉండాలని నా భావన' అని అభిప్రాయపడ్డాడు.
ఇంకా మాట్లాడుతూ.. 'అలా జట్టులో ఓ స్పిన్నర్ ఉంటే.. జట్టుకి అదనపు బలం అవుతాడు. లెగ్‌స్పిన్నర్ ఎప్పుడూ ఉత్తేజంగా ఉంటారు. అబ్దుల్ ఖాదర్ అప్పట్లో గూగ్లీలను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ తర్వాత భారత్ తరఫున అనిల్ కుంబ్లే, ఆస్ట్రేలియా నుంచి షేన్ వార్న్, పాకిస్థాన్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ ఇలా చాలా మంది ఆ బంతుల్ని విసురుతూ వేగంగా వెలుగులోకి వచ్చారు' అని హఫీజ్ వివరించాడు. దాంతో పాటుగా ఆ దేశం ఐపీఎల్‌తో పోటీ పడుతూ నిర్వహిస్తోన్న పాకిస్థాన్ సూపర్ లీగ్ విజయవంతం కావాలనే కాంక్షను వెలిబుచ్చాడు.