
సిరాజ్ సూపర్ షో
బంగ్లా ఇన్నింగ్స్ ఆరంభమైన తొలి బంతికే ఆ జట్టును సిరాజ్ దెబ్బతీశాడు. ఓపెనర్ షాంటోను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులో కుదురుకుంటున్న బంగ్లా కీలక బ్యాటర్ లిటాన్ దాస్‌ను కూడా బౌల్డ్ చేశాడు. అప్పటికి మంచి టచ్‌లోకి వచ్చిన మరో ఓపెనర్ జాకిర్ హసన్‌ను కూడా తనే అవుట్ చేశాడు. మధ్యలో ఉమేష్ యాదవ్ కూడా ఒక వికెట్ తీయడంతో బంగ్లా జట్టు విలవిల్లాడింది. భారత బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో కూడా ఆ జట్టు బ్యాటర్లకు అర్థం కాలేదు.

కుల్దీప్ మాయ..
సిరాజ్, ఉమేష్ ఇచ్చిన ఆరంభాన్ని కుల్దీప్ యాదవ్ చక్కగా ఉపయోగించుకున్నాడు. వేరియేషన్స్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై తనదైన స్టైల్లో చెలరేగాడు. బంగ్లా సారధి షకీబల్ హసన్ (3)ను తన తొలి ఓవర్లోనే అవుట్ చేసిన కుల్దీప్.. ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేదు.
తనకు బౌలింగ్ వచ్చినప్పుడల్లా బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ క్రమంలోనే సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం (28), నురుల్ హసన్ (16), తైజుల్ ఇస్లాం (0) ముగ్గురి వికెట్లు తీశాడు. అయితే మెహదీ హసన్ (16 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు.

అలా బోల్తా కొట్టించా..
రెండో రోజు ఆటలో నాలుగు వికెట్లతో చెలరేగిన కుల్దీప్.. బంగ్లా మిడిలార్డర్‌ను తుత్తునియలు చేశాడు. అయితే తను వేసిన తొలి ఓవర్లోనే వికెట్ దక్కడం అదృష్టమని కుల్దీప్ యాదవ్ అన్నాడు. దీంతో తన ఫీలింగ్ మారిందన్నాడు. ఆ తర్వాత పిచ్ వేరియేషన్స్‌కు సహకరిస్తోందని అర్థమైందని, దాన్ని ఉపయోగించుకొన్నానని చెప్పాడు. మంచి రిథమ్‌లో బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తే, అదే తనకు అచ్చొచ్చిందని చెప్పాడు.
కొన్ని నెలల క్రితం ఇండియా-ఎ తరఫున ఆడినప్పుడు ఓవర్ ది వికెట్, అరౌండ్ ది వికెట్ రెండు వైపుల నుంచి బౌలింగ్ చేయడం బాగా ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. అదే తనకు కలిసొచ్చిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఏదేమైనా భారత బౌలర్ల ధాటికి రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ కేవలం 133 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.


Click it and Unblock the Notifications












