
ముంబై: మైదానంలో సవాళ్లు ఎదురైనప్పుడు వాటిని ఛేదించడమెలాగో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకున్నానని భారత చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ తెలిపాడు. యువ క్రికెటర్లలో స్ఫూర్తి నింపడంలో కెప్టెన్ కోహ్లీ ఎప్పుడూ ఫెయిలవలేదని చెప్పాడు. 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కుల్దీప్.. ఇప్పటి వరకూ 6 టెస్టులు, 60 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 167 వికెట్లు పడగొట్టాడు.
తాజాగా కుల్‌దీప్ యాదవ్ మాట్లాడుతూ... 'క్లిష్ట పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో విరాట్ కోహ్లీని చూసి నేర్చుకున్నా. కెప్టెన్ నీపై నమ్మకం ఉంచితే.. మైదానంలో అత్యుత్తమ ప్రదర్శనని కనబర్చడం చాలా సులువు అవుతుంది. మనపై ఒత్తిడే ఉండదు. యువ క్రికెటర్లలో స్ఫూర్తి నింపడంలో కోహ్లీ ఎప్పుడూ ఫెయిలవలేదు. నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను కొత్తగా జట్టులోకి వచ్చినప్పుడు విరాట్ నాకు మద్దతుగా నిలిచాడు. కెప్టెన్‌గా ఆటగాళ్లని అర్థం చేసుకోవడం కోహ్లీకి ఉన్న మంచి లక్షణం' అని కుల్దీప్ పేర్కొన్నాడు.
కుల్‌దీప్ యాదవ్ 2017 లో అజింక్య రహానే సారథ్యంలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2017లో ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగవ టెస్టులో ఆడాడు. ఆ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి గాయం అవడంతో రహానే జట్టు సారధ్య బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుండి కుల్‌దీప్ తనదైన ముద్ర వేసాడు. ప్రత్యేకించి పరిమిత ఓవర్లలో యుజ్వేంద్ర చాహల్‌తో కలిసి బాగా బౌలింగ్ చేసాడు. కుల్‌దీప్ కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ కివీస్ పర్యటనలో ఆడిన ఒకే ఒక్క మ్యాచ్‌లో కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
భారత వన్డే, టీ20 జట్టులో గత ఏడాది వరకూ చహల్, కుల్దీప్ కలిసి ఆడేవారు. కానీ రవీంద్ర జడేజా నిలకడగా రాణిస్తుండటంతో.. చహల్ లేదా కుల్దీప్‌లో ఒక్కరికే అవకాశం దక్కుతోంది. జడేజా ఎడమచేతి వాటం బౌలర్ కావడంతో.. ఎక్కువ సార్లు కుల్దీప్ యాదవ్ రిజర్వ్ బెంచ్‌పై కూర్చోవాల్సి వస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని చాలా మిస్సవుతున్నా అని కుల్దీప్ పేర్కొన్నాడు. ధోనీ టీమిండియా తరఫున మళ్లీ ఆడాలని ఆకాంక్షించాడు. గతేడాది వన్డే ప్రపంచకప్ నుంచి మహీ క్రికెట్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.