ఆసీస్ పర్యటనలో వార్న్ సలహాల వల్లే!: కుల్దీప్ యాదవ్


హైదరాబాద్: గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్. మూడు ఫార్మాట్లలో సైతం నిలకడగా రాణిస్తూ తన బౌలింగ్‌లో మరిన్ని మెరుగులు దిద్దుకుంటున్నాడు. ఇటీవలే ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలోనూ కుల్దీప్ మెరుగైన ప్రదర్శన చేసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో తొలి మూడు టెస్టుల్లో సైట్ లైన్స్‌కే పరిమితమైన కుల్దీప్ నాలుగో టెస్టులో మాత్రం హీరో అయ్యాడు.

ఆఖరి టెస్టులో ఐదు వికెట్లు తీసిన కుల్దీప్
సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఫైవ్ వికెట్ హాల్ తీశాడు. ముఖ్యంగా తన బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. అయితే, వర్షం కారణంగా ఆఖరి టెస్టు రద్దు అయినప్పటికీ... అప్పటికే టెస్టు సిరిస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్ నెగ్గిన ఆసియా దేశంగా భారత్ నిలిచింది.

వార్న్‌తో మాట్లాడిన అనుభవం
తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో మాజీ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్‌తో మాట్లాడిన అనుభవం ఉపయోగపడిందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు కుల్దీప్ మాట్లాడుతూ "మేం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు షేన్ వార్న్ మాకు బాగా దగ్గరయ్యారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రతిరోజూ ఉదయాన్నే ఆయనతో నేను మాట్లడేవాడిని. నా బౌలింగ్ గురించి ఇద్దరం చర్చించుకునే వాళ్లం" అని అన్నాడు.

వార్న్ నాకెంతో ప్రేరణ ఇచ్చారు
"అక్కడున్నన్ని రోజులు షేన్ వార్న్ నాకెంతో ప్రేరణ ఇచ్చారు. హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆయనకు నన్ను పరిచయం చేశారు. ఆస్ట్రేలియాలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఎలా బౌలింగ్ చేయాలనే విషయాలను షేన్ వార్న్ నాతో పంచుకున్నారు. ఆయన సలహాలు నాకెంతో ఉపయోగపడ్డాయి" అని కుల్దీప్ తెలిపాడు.

ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టుకు
మరో ఆసీస్ బౌలర్ బ్రాడ్ హాగ్ గురించి మాట్లాడుతూ "పెర్త్ మ్యాచ్‌లో భాగంగా టీ బ్రేక్ సమయంలో బ్రాడ్‌ను కలిశాను. మణికట్టు బౌలింగ్ గురించి ఆయనతో చర్చించాను" అని కుల్దీప్ చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కుల్దీప్ యాదవ్, బ్రాడ్ హాగ్ ఇద్దరూ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరుపున ఆడిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications