జొహానెస్‌బర్గ్ వేదికగా జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సౌతాఫ్రికాతో కలిసి అందుకుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. అయితే ఆఖరి టీ20లో శతకంతో చెలరేగిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందకున్నాడు.
అవార్డు అందుకున్న అనంతరం సూర్యకుమార్ మాట్లాడాడు. తన గాయంపై స్పందిస్తూ ప్రస్తుతం బాగానే ఉన్నానని తెలిపాడు. నడుస్తున్నాని, మంచిగానే ఉన్నానని చెప్పాడు. ఫీల్డింగ్ చేస్తుండగా సూర్య ఎడమ చీలమండకు గాయమైంది. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపి త్రో విసిరే సమయంలో అతడి లెఫ్ట్ యాంకిల్ ట్విస్ట్ అయ్యింది. దాం1తో మైదానంలోనే కుప్పకూలిన సూర్య తీవ్ర నొప్పితో విలవిలలాడాడు. తర్వాత టీమిండియా సిబ్బంది సూర్యను భుజాలపై ఎత్తుకొని డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఆ టైమ్‌కు సూర్య కనీసం కాలును కింద కూడా పెట్టలేకపోయాడు.

సౌతాఫ్రికాపై విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్‌దీప్ యాదవ్ గురించి సూర్య మాట్లాడాడు. ''కుల్‌దీప్ హ్యాపీగా అసలు ఉండడు. వికెట్లు మరిన్ని తీయాలని ఆకలితో ఉంటాడు. తన బర్త్ డే రోజు తానే గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. ఇక నేను సాధించిన సెంచరీ విజయానికి ఓ కారణమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఫియర్ లెస్ బ్రాండ్ క్రికెట్‌ను ఆడటానికే మేం ప్రయత్నిస్తుంటాం'' అని సూర్య అన్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. యశస్వి జైస్వాల్(41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్, లిజాడ్ విలియమ్స్ రెండేసి వికెట్లు తీయగా.. నాండ్రె బర్గర్, టబ్రైజ్ షంసీ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా.. కుల్దీప్ యాదవ్(5/17) ధాటికి 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్ మిల్లర్(35), ఎయిడెన్ మార్క్‌రమ్(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు తోడుగా రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ తీసారు.