భారత్‌తో జరిగిన అయిదు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 1-4తో కోల్పోయింది. ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించి సిరీస్‌పై అంచనాలు పెంచింది. కానీ ఆ తర్వాత మ్యాచ్‌ల్లో దారుణంగా ఓటమిపాలైంది. అయితే సిరీస్‌లోని అనుభవాలను ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
ధర్మశాల వేదికగా జరిగిన టెస్టులో అండర్సన్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా, ఓవరాల్‌గా మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అతని కంటే ముందు ముత్తయ్య మురళీథరన్, షేన్ వార్న్ ఈ ఘనత సాధించారు. అయితే ధర్మశాల టెస్టులో అండర్సన్ రికార్డు సాధించడంతో పాటు గిల్‌తో గొడవకు దిగాడు.

దాని గురించి అండర్సన్ మాట్లాడుతూ.. ''భారత్‌లో కాకుండా విదేశాల్లో ఎన్ని పరుగులు సాధించావు అని గిల్‌తో అన్నాను. దానికి గిల్ 'ఇది రిటైర్మెంట్ తీసుకునే సమయం' అంటూ ఎద్దేవా చేశాడు. కానీ రెండు బంతుల తర్వాత అతడిని ఔట్ చేశాను'' అని వివరించాడు. గిల్ వికెట్‌తో అండర్సన్ ఖాతాలో 699 వికెట్లు చేరాయి. ఆ తర్వాత కుల్‌దీప్ యాదవ్‌ను ఔట్ చేసి 700 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.
అయితే 700 వికెట్‌గా తానే ఔటవుతానని అండర్సన్‌తో కుల్‌దీప్ ముందే ఊహించి చెప్పేశాడంట. అలా అని, కుల్‌దీప్ స్వతహాగా ఔట్ అవ్వలేదని, కానీ భవిష్యత్‌ను ఊహించి కుల్‌దీప్ చెప్పాడని అండర్సన్ తెలిపాడు. '' కుల్‌దీప్ థర్డ్ మ్యాన్ దిశగా సింగిల్ తీసి నాన్‌స్ట్రైకర్ ఎండ్ వైపుకు వచ్చాడు. ఆ సమయంలో నేను తర్వాతి బాల్ వేయడానికి నా మార్క్ వద్దకు వెళ్తున్నాను. అప్పడు కుల్‌దీప్ 'నీ 700 వికెట్‌ను నేనే అవుతా' అని అన్నాడు. తాను కావాలనే వికెట్ సమర్పించుకుంటా అన్నట్లుగా అతడు చెప్పలేదు. అదే జరుగుతుందనే అనుభూతి తనకు ఎదురైంది. ఆ క్షణంలో మేం ఇద్దరం నవ్వుకున్నాం'' అని అండర్సన్ పేర్కొన్నాడు.