టీమిండియా వికెట్ కీపర్, తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ (116*; 165 బంతుల్లో) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లాండ్ లయన్స్‌తో జరుగుతున్న అనధికారిక టెస్టులో భారత్-ఎ తరపున సత్తాచాటాడు. అతడి పోరాటంతో తొలి అనధికారిక టెస్టు డ్రా ముగిసింది. అయితే భరత్ తన శతకాన్ని శ్రీరాముడికి అంకితం చేశాడు.
మూడంకెల స్కోరును అందుకున్న అనంతరం రాముడిలా విల్లు ఎక్కుపెడుతూ కేఎస్ భరత్ సెలబ్రేషన్స్ చేశాడు. రేపు అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాముడికి తన సెంచరీని అంకితం చేస్తూ భరత్ తన భక్తిని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

కాగా, అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ లయన్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 553 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ జెన్నింగ్స్ (154; 188 బంతుల్లో), కెప్టెన్ జోష్ బోహన్నన్ (125; 182 బంతుల్లో) సెంచరీలు సాధించారు. అలెక్స్ (73), మౌస్లీ (68)చ జాక్ కార్సన్ (53*) అర్ధశతకాలు సాధించారు. మనవ్ నాలుగు వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ సీనియర్ జట్టు మాదిరిగానే లయన్స్ జట్టు కూడా బజ్ బాల్ క్రికెట్ అప్రోచ్‌ను అనుసరించింది.
అయితే ఇండియా-ఏ జట్టు 227 పరుగులకే ఆలౌటైంది. ఆ మాత్రం స్కోరు చేసిందంటే అది రజత్ పటిదార్ చలవే. సహచరులంతా వెనుదిరుగుతున్నా అతడు వన్డే ఫార్మాట్‌లా 158 బంతుల్లో 151 పరుగులు సాధించారు. తుషార్ దేశపాండే చేసిన 23 పరుగులే భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోరు. మాథ్యూస్ పాట్స్, ఫిషర్ చెరో నాలుగు వికెట్లు తీశారు.
ఇంగ్లాండ్ లయన్స్ 163/6 స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. జెన్నింగ్స్ (64), జేమ్స్ (56) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం 489 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్-ఏ అయిదు వికెట్లు కోల్పోయి 426 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా గా ముగించింది. అయితే ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సాయి సుదర్శన్ (97; 208 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (55; 67) ఆదుకున్నారు. సర్ఫరాజ్ ఔటైనా ప్రదోష్ (43)తో కలిసి సుదర్శన్ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. అయితే పర్కిన్సన్ బౌలింగ్‌లో ఔటై సెంచరీని తృటిలో సుదర్మన్ చేజార్చుకున్నాడు.
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన భరత్.. మనవ్ (89*; 254 బంతుల్లో)తో కలిసి ద్విశతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును అద్భుత పోరాటంతో గెలుపు దిశగా నడిపించాడు. మరికొన్ని ఓవర్లపాటు ఆట కొనసాగితే జట్టును కచ్చితంగా విజయ తీరాలకు చేర్చేవాడు. మొత్తంగా గొప్ప పోరాటంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. కాగా, జనవరి 25 నుంచి జరగనున్న ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు భరత్ ప్రధాన వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు.