"హే పాకిస్తాన్.. రాకండి.. వస్తే మా వాళ్లు తాట తీస్తారు" అంటూ టీమిండియా లెజెండ్.. 1983 వరల్డ్ కప్ హీరో కృష్ణమాచారి శ్రీకాంత్ పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. 2026 టీ20 ప్రపంచకప్ విషయంలో పాకిస్థాన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
వివాదం నేపథ్యం ఏమిటి?
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ తప్పించింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్.. తమ మ్యాచ్‌లను తటస్థ వేదికలకు మార్చాలని డిమాండ్ చేసింది. దీనికి ఐసీసీ అంగీకరించకపోవడంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చారు. ఈ నిర్ణయంపై పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బంగ్లాకు మద్దతుగా తాము కూడా టోర్నీ నుంచి తప్పుకోవచ్చని లేదా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించే అవకాశం ఉందని పరోక్షంగా హెచ్చరించారు.

శ్రీకాంత్ కౌంటర్: "రాకపోతే మీకే మంచిది!"
మొహ్సిన్ నఖ్వీ కామెంట్స్‌పై స్పందించిన శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పాకిస్థాన్‌ను ఎండగట్టారు. "హే పాకిస్తాన్, రాకండి. మీ వాడు మొహ్సిన్ నఖ్వీ ఏదో చెబుతున్నాడు కదా.. దానికే కట్టుబడి ఉండండి. ఒకవేళ వస్తే మా కుర్రాళ్లు మిమ్మల్ని తాట తీస్తారు. ఈ రోజుల్లో టీమిండియా ఆడుతున్న విధ్వంసకర బ్యాటింగ్ చూసి చాలా టీమ్‌లు భయపడుతున్నాయి. మా బ్యాటర్లు కొలంబోలో సిక్స్ కొడితే ఆ బంతి మద్రాసులో పడుతుంది. అంత డేంజరస్‌గా ఆడుతున్నారు. ఏదో ఒక సాకు వెతుక్కుని రాకుండా ఉండటమే మీకు ఉత్తమం. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 15 ఓవర్లలో 209 పరుగులు, మరో మ్యాచ్‌లో 10 ఓవర్లలోనే 150 పరుగులు చేసింది. ఇలాంటి బ్యాటింగ్ నేను ఇప్పటి వరకు చూడలేదు." అని కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నారు.
పాక్ పరిస్థితి: ఐసీసీ వర్సెస్ పీసీబీ
పాకిస్థాన్ ఇప్పటికే తమ వరల్డ్ కప్ జట్టును ప్రకటించినప్పటికీ, టోర్నీలో పాల్గొనడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. పాల్గొనాలా లేదా అనే అంశంపై పాక్ ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదని మొహ్సిన్ నఖ్వీ పేర్కొన్నారు. దీనిపై ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకవేళ పాకిస్థాన్ టోర్నీని బహిష్కరిస్తే ఐసీసీ నుంచి కఠిన చర్యలు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారీ జరిమానాతో పాటు పాకిస్థాన్ సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉంది. మరోవైపు టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుండగా.. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబో వేదికగా జరగనుంది.