
బెంగళూరు: కర్ణాటక ప్రీమియమ్ లీగ్ (కేపీఎల్) క్రికెట్ మ్యాచ్ సందర్బంగా మ్యాచ్ ఫిక్సింగ్ కేసు విచారణ చేస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు ఒక అంతర్జాతీయ బుకీని అరెస్టు చేశారు. కేపీఎల్‌లో పలు మ్యాచ్‌లను ఫిక్సింగ్‌కు చేయడానికి పాల్పడ్డ హర్యానాకు చెందిన సయ్యమ్ అనే వ్యక్తిని సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రముఖ డ్రమ్మర్ భవేశ్ బఫ్నా ఇదే ఫిక్సింగ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. బఫ్నా గత నెలలోనే పోలీసులకు చిక్కి కస్టడీలో ఉన్నాడు. బఫ్నా సాయంతో మ్యాచ్‌లను ఫిక్స్ చేయడానికి సయ్యమ్ యత్నించాడు. అయితే అతనిపై ముందుగా లుక్ ఔట్ నోటీసులు పోలీసులు జారీ చేశారు. వెస్టిండీస్‌లో దాక్కొన్న సయ్యమ్‌ని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
మ్యాచ్ ఫిక్సింగ్ కేసులోనే ఇటీవల బళ్లారి టస్కర్స్ కెప్టెన్ సీఎం గౌతమ్‌తో పాటు అబ్రార్ కాజీలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 31న టస్కర్స్, హుబ్లీ జట్ల మధ్య జరిగిన కేపీఎల్ ఫైనల్ మ్యాచులో వీరిద్దరూ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడానికి రూ. 20 లక్షలకు ఒప్పందం చేసుకున్నారని ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్నాయి. దాంతో వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా బుకీని కూడా అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
మైసూరులో జరిగిన కేపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో భారీగా బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని పోలీసులకు సమాచారం అందింది. 1 ఓవర్‌కు 10 పరుగులు ఇస్తే రూ. 5 లక్షలు ఇస్తామని మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. పరుగులు ఇచ్చిన వారికి సయ్యమ్ రూ. 5 లక్షలు ఆఫర్ ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ మ్యాచ్ ఫిక్సింగ్‌లో లేడీ మోడల్స్, యువతులతో క్రికెట్ ఆటగాళ్లను బుక్కీ సయ్యమ్ సంప్రధించాడని పోలీసులు వివరాలు సేకరించారు. బెట్టింగ్‌కు సంబంధించి విచారణ చేస్తున్న సీసీబీ పోలీసులు ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు.