మెల్బోర్న్: ఆస్టేలియాలో నవంబర్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టనున్న డే/నైట్ టెస్టు మ్యాచ్ కోసం గులాబీ రంగు బంతులు (పింక్ బాల్స్) సిద్ధంగా ఉన్నాయని క్రికెట్ బాల్స్ తయారీ సంస్ధ కూకబురా చెప్పింది.
ఈ ఏడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌తో డే/నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్టేలియా సన్నాహాలు చేస్తోంది. అడిలైడ్, బ్రిస్బేన్, హోబర్ట్‌ల్లో ఏదో ఒకటి ఈ మ్యాచ్‌కు వేదికకానుంది. ఈ మ్యాచ్ గనుక జరిగితే క్రికెట్ చరిత్రలోనే తొలి డే/నైట్ టెస్ట్‌గా నిలిచిపోనుంది.

గత ఐదేళ్లలో కూకబురా గులాబీ బంతిని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ర్టేలియాలు పరీక్షిస్తూనే ఉన్నాయి. అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లో ఈ గులాబీ బంతిని ఉపయోగించవచ్చు. వెస్టిండిస్, దక్షిణాఫ్రికా బోర్డులు కూడా దేశవాళీ టోర్నమెంట్లో ఈ గులాబీ బంతులను ఉపయోగించాయని కూకబురా మేనేజింగ్ డైరెక్టర్ బ్రెట్ ఇలియట్ చెప్పారు.
కాగా, రాత్రి సమయంలో గులాబీ బంతి స్పష్టంగా కనిపించదనే విమర్శలు వచ్చాయని, అయితే అలాంటిదేమీ లేదని అనేక పరీక్షల అనంతరం ఈ బంతి స్పష్టంగానే కనిపిస్తుందని నిర్దారించుకున్నామని, కొత్త బంతి ఆరంభంలో స్వింగ్ కూడా అవుతుందని ఆయన వివరించారు.