గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ 2022 క్వాలిఫైయర్ 1 మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సందర్భంగా కోల్కతాలో వాతావరణం గురించి పూర్తిగా టెన్షన్ నెలకొంది. ఈ మ్యాచ్ వర్షార్పితం అవుతుందేమోననేలా కోల్ కతాలో వాతావరణం కాస్త అనుకూలించడం లేదు. వాతావరణ అప్డేట్స్ సైతం మ్యాచ్ జరగడం సందేహమే అనేలా వస్తుండడంతో క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.
ఇక తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు సోషల్ మీడియా విభాగం.. రాజస్థాన్ ప్లేయర్లు బస చేసిన హోటల్ కిటికీల నుంచి వర్షం కురుస్తున్న వీడియోను తీసి ట్విట్టరులో పోస్టు చేసింది. వీడియోలో కోల్కతాలో ఆకాశం దట్టమైన మేఘాలు కమ్ముకున్నట్లు ఉంది. వాన కూడా కురుస్తుంది. రోడ్లుకూడా చాలా తడిగా ఉన్నాయి. ఇలాగే వాన కురిస్తే మాత్రం ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న కోట్లాది ప్రేక్షకులకు చేదు వార్తే అవుతుంది.
ఇకపోతే AccuWeather వెబ్సైట్ ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది కానీ సాయంత్రం వాతావరణం కొద్దిసేపు క్లియర్ అవుతుందని తేలింది. కానీ రాత్రి 8గంటలకు ఉరుములతో కూడిన మేఘావృతమైన ఆకాశం ఉండొచ్చని వెబ్ సైట్ చూపిస్తోంది. ఇక గాచారం బాగా లేక వర్షం పడితే మాత్రం మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకుంటాయి. ఒకవేళ వరుణదేవుడు కరుణించకపోతే ఎట్ లీస్ట్ సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించే వీలుంది. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా నిర్ణయించలేని పక్షంలో లీగ్ దశలో ఏ జట్టు మెరుగైన స్థానంలో ఉంటుందో ఆ జట్టు విజేతగా నిలిచి ఫైనల్ చేరుతుంది.
Kolkata rn 🌧😞#RoyalsFamily | #GTvRR pic.twitter.com/qCOEomnxLL
— Rajasthan Royals (@rajasthanroyals) May 24, 2022
ఇదే జరిగితే గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి ఫైనల్ చేరుతుంది. రాజస్థాన్ రాయల్స్ రెండో క్వాలిఫయర్ ఆడాల్సి వస్తోంది. ఒకవేళ వర్షం కొంత సేపు ఆడడానికి అవకాశమిచ్చినా ఓవర్లను కుదించి మ్యాచ్ నిర్వహించే వీలుంటుంది. ఎట్ లీస్ట్ ఇరు జట్లు ఐదు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసేలా మ్యాచ్ జరపడానికి వీలుంటుంది. అది కుదరకపోతే సూపర్ ఓవర్, సూపర్ ఓవర్ కూడా కుదరకపోతే, లీగ్ దశలో టేబుల్ టాపర్ విజేతగా నిలుస్తుంది.