బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల ఢిల్లీ, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన కొన్ని ఫొటోలు, వీడియోలు వీళ్లిద్దరి మధ్య ఉన్న గొడవను మరింత స్పష్టం చేశాయి.
ఢిల్లీ మ్యాచ్‌లో డీసీ డగౌట్ ఎదురుగానే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ ఒక క్యాచ్ అందుకున్నాడు. దీన్ని సెలబ్రేట్ చేసుకున్న తర్వాత డీసీ డగౌట్‌లో కూర్చొని ఉన్న గంగూలీ వైపు సీరియస్‌గా చూస్తూ వెళ్లిపోయాడు. ఇది జరిగిన కాసేపటికే ఢిల్లీ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ క్రమంలో రెండు జట్ల సిబ్బంది షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ఈ సమయంలో కోహ్లీతో చెయ్యి కలిపేందుకు గంగూలీ ఇష్టపడలేదు.

రికీ పాంటింగ్‌కు కోహ్లీ షేక్ హ్యాండ్ ఇస్తుండగా.. వాళ్లను దాటేసి ఆ తర్వాతి వారితో కరచాలనం చేస్తూ వెళ్లిపోయాడు గంగూలీ. ఇది చూసిన కోహ్లీ కూడా వెనక్కు తిరిగి గంగూలీ వైపు చూసినా తన దారిన తాను వెళ్లిపోయాడు. ఆ తర్వాత మరో వీడియో నెట్టింట ప్రత్యక్షమైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమైన ఆర్‌సీబీ అందుకు సిద్ధం అవుతుండగా.. కోహ్లీని గంగూలీ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రవర్తించాడు.
ఇంత గొడవ జరుగుతున్న నేపథ్యంలో వీళ్లిద్దరి గొడవ సోషల్ మీడియాకు కూడా పాకింది. ఈ క్రమంలోనే గంగూలీని ఇన్‌స్టాగ్రాంలో అన్‌ఫాలో చేసేశాడు కోహ్లీ. దీంతో ఈ గొడవ మరింత రచ్చకెక్కింది. ఇప్పుడు దీనికి ప్రతిగా గంగూలీ కూడా కోహ్లీని అన్‌ఫాలో చేశాడు. ఇదంతా చూసిన క్రికెట్ అభిమానులు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. కొంత మంది కోహ్లీని తిడుతుంటే.. కొందరు గంగూలీని తిట్టిపోస్తున్నారు. ఈ గొడవ ఎప్పటికి చల్లబడుతుందో అని చాలా మంది క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
గతేడాది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విరాట్ కోహ్లీని టీమిండియా వన్డే కెప్టెన్‌గా బీసీసీఐ తొలగించిన సంగతి తెలిసిందే. అప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్‌గా గంగూలీ ఉన్నాడు. ఈ నిర్ణయం తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కోహ్లీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. ఇక చివరగా తన టెస్టు కెప్టెన్సీకి కూడా కోహ్లీ వీడ్కోలు పలికాడు. అక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదని ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు చూస్తే తెలుస్తోంది.