
హైదరాబాద్: ఇంగ్లాండ్ గడ్డపై బుధవారం నుంచి ప్రారంభంకానున్న టెస్టు సిరీస్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయమని కోచ్ రవిశాస్త్రి ధీమా వ్యక్తం చేశాడు. 2014లో చివరిసారి ఇంగ్లాండ్‌లో టెస్టులు ఆడిన కోహ్లి.. పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. అయితే.. అప్పటితో పోలిస్తే కోహ్లి బ్యాటింగ్ ఇప్పుడు చాలా మెరుగైందని.. నాలుగేళ్లలో అతను సాధించిన రికార్డ్స్ దానికి నిదర్శనమని రవిశాస్త్రి వివరించాడు. 2014 పర్యటనలో మొత్తం ఐదు టెస్టులాడిన కోహ్లి.. వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20 పరుగులతో ఘోరంగా విఫలమయ్యాడు.
'అవును.. నాలుగేళ్ల క్రితం విరాట్ కోహ్లి ఇక్కడ టెస్టుల్లో విఫలమయ్యాడు. కానీ.. ఆ తర్వాత బ్యాటింగ్‌కి మెరుగులు దిద్దుకుని.. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు. ఈ విషయాన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. అతను సాధించిన రికార్డులు చూస్తే చాలు. ఫామ్‌లో ఉన్నప్పుడు.. ఆటగాడు మానసికంగానూ చాలా బలంగా ఉంటాడు. వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా తనని ఎందుకు పిలుస్తున్నారో..? బ్రిటీష్ అభిమానులకి విరాట్ కోహ్లి ఈ టెస్టు సిరీస్ ద్వారా తెలియజెప్పనున్నాడు' అని రవిశాస్త్రి వెల్లడించాడు.
ఇంగ్లాండ్‌తో మొత్తం ఐదు టెస్టులను ఈ సిరీస్‌లో భారత్ ఆడనుంది. 'ఇద్దరు ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి క్రికెటర్ ఏ ఫార్మాట్ అయినా ఆకలింపు చేసుకుంటున్నాడు. వీరిలో ఎవరు గొప్ప అని చెప్పడం మాత్రం కష్టమే. ఇద్దరు మ్యాచ్ విన్నర్సే. ఇద్దరి ఆటను ఆస్వాదించడానికి ఇష్టపడుతాను. పరుగులతో ఎవరు గొప్ప అని చెప్పలేం. పరిస్థితుల తగ్గట్టు ఆడినవారే గొప్పవారు. కొన్ని సందర్భాల్లో సెంచరీల కన్నా హాఫ్ సెంచరీలు కూడా కీలకం అవుతాయి' అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ గ్రాహమ్ గూచ్ అన్నాడు.
ఇంగ్లీషు గడ్డపై గత పర్యటనలో విఫలమైన కోహ్లీ ఈసారి మాత్రం తన రికార్డును మెరుగుపరుచుకోవాలనే పట్టుదలతో ఆతిథ్య జట్టుకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కోహ్లీసేన తలపడనుంది.