
ఆసీస్‌పై అత్యథిక సెంచరీలు
తన కెరీర్‌లో కోహ్లీ ఎక్కువగా ఇష్టపడే ప్రత్యర్థుల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఈ జట్టుపై ఇప్పటి వరకు కోహ్లీ ఏడు సెంచరీలు బాదాడు. దీంతో ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు బాదిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ 11 సెంచరీలు బాదగా.. సునీల్ గవాస్కర్ 8 సెంచరీలు చేశాడు. కోహ్లీ కనుక ఈ సిరీస్‌లో కనీసం రెండు సెంచరీలు బాదితే.. గవాస్కర్‌ను దాటేసి టెస్టు క్రికెట్‌లో ఆసీస్‌పై అత్యధిక సెంచరీలు బాదిన రెండో భారత క్రికెటర్‌గా ఎదుగుతాడు.

డేంజర్‌లో సెహ్వాగ్ రికార్డు
టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు సంబంధించిన మరో కీలక రికార్డును కూడా కోహ్లీ ఈ సిరీస్‌లో బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కోహ్లీ తన టెస్టు కెరీర్‌లో సుమారు 49 సగటుతో 8119 పరుగులు చేసి ఉన్నాడు. ఈ నాలుగు టెస్టుల్లో కనుక అతను 391 పరుగులు చేస్తే.. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సెహ్వాగ్‌ను దాటేస్తాడు. సెహ్వాగ్ తన కెరీర్‌లో 8503 పరుగులు చేశాడు. కోహ్లీ ఈ సిరీస్‌లో అతన్ని దాటేసి భారత్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా రికార్డు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

సచిన్‌ను దాటేసే ఛాన్స్
ఈ టెస్టు సిరీస్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు చెందిన మరో కీలకమైన రికార్డును కూడా కోహ్లీ బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 546 ఇన్నింగ్స్‌లలో 24,936 పరుగులు చేశాడు. ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో కనుక అతను 64 పరుగులు చేస్తే.. అత్యంత వేగంగా 25 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ 576 ఇన్నింగ్సుల్లో 25 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లీ అంతకన్నా వేగంగానే ఈ రికార్డును చేరుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications
