
హైదరాబాద్: భారత జట్టులోని ఆటగాళ్లకి నిర్వహించే యో-యో ఫిట్‌నెస్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ పాసైనట్లు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీతో పాటు భువనేశ్వర్ కుమార్, సురేశ్ రైనా, కేదార్ జాదవ్ హాజరైనట్లు తెలుస్తోంది.
జులై 3 నుంచి జరగనున్న ఇంగ్లాండ్ పర్యటనను దృష్టిలో పెట్టుకొని వీరికి యో-యో ఫిట్‌నెస్ టెస్టును నిర్వహించనున్నారు. ఐపీఎల్ అనంతరం గాయం కారణంగా ఇంగ్లాండ్ జరుగుతున్న కౌంటీల్లో ఆడేందుకు దూరమైన కెప్టెన్ కోహ్లీ ఇటీవల తిరిగి నెట్స్‌లో ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఈ నేఫథ్యంలో శుక్రవారం కోహ్లీతో పాటు పలువురు ఫిట్‌నెస్ పరీక్షకు హాజరయ్యారు.
విరాట్ కోహ్లీ యో-యో టెస్టుని ధోనీతో సమానంగా పూర్తి చేశాడట. కానీ.. అతని మెడ గాయంపై ఇంకా స్పష్టత రావడం లేదు. జూన్ 27, 29న ఐర్లాండ్‌తో రెండు టీ20లు మ్యాచ్‌ల్ని భారత్ ఆడనుండటంతో.. ఒకవేళ గాయం నుంచి కోహ్లీ పూర్తిగా కోలుకుని ఉంటే ఆ సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది.
ఆలా కాని పక్షంలో నేరుగా ఇంగ్లాండ్ పర్యటనలోనే తిరిగి కోహ్లీ మైదానంలోకి దిగనున్నాడు. మరోవైపు ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి యో-యో టెస్టు అర్హత మార్కును పెంచాలన్న ప్రతిపాదనను బీసీసీఐ ముందుంచినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం యో-యో ఫిట్‌నెస్ టెస్టులో ఉత్తీర్ణత సాధించాలంటే సదరు క్రికెటర్ కనీసం 16.1 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. అయితే దీనిని 16.3కి పెంచాలనే యోచనలో బీసీసీఐ ఉంది. 16.1నే అందుకోలేక సురేశ్‌రైనా, యువరాజ్ సింగ్ భారత జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. అలాంటిది ఫిట్‌నెస్ టెస్టులో అర్హత మార్కు పెంచితే సీనియర్ క్రికెటర్లు పరిస్థితి ఏంటో మరి.