హైదరాబాద్: పూణె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమి పాలైంది. 441 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 33.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. తద్వారా 12 ఏళ్ల తర్వాత భారత్‌లో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ గెలిచింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగిన ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్, రెండో ఇన్నింగ్స్‌లో కూడా చెలరేగాడు. ముఖ్యంగా భారత బ్యాట్స్‌మెన్లకు వెన్నులో వణుకు పుట్టించాడు. తన అద్భుతమైన బౌలింగ్‌తో కోహ్లీసేనను చుట్టేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఓకీఫ్ ఆరు వికెట్లు తీసుకోగా, నాథన్ లియాన్ 4 వికెట్లు తీసుకున్నాడు.
భారత బ్యాట్స్‌మెన్లలో మురళీ విజయ్ 2, పుజారా 31, విరాట్ కోహ్లి 13, రహానే 18, అశ్విన్ 8, సాహా 5 లాంటి కీలక వికెట్లను ఓకీఫ్ దక్కించుకున్నాడు. బౌన్స్, టర్న్ ఊహించని రీతిలో ఉన్న పిచ్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం తడబడ్డాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ అవుటైన తీరు విమర్శలకు తావిస్తోంది.
స్పిన్ తిరుగుతున్న పిచ్‌పై బంతిని ఆడడమే మేలని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ కోహ్లీ అలా చేయక పోవడం వల్లే అవుటయ్యాడని అంటున్నారు. నిజానికి ఆడాల్సిన బంతిని వదిలేసిన కోహ్లీ తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. ఓ స్పిన్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఇదే స్పిన్‌ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. స్పిన్ బంతుల్ని తెలివిగా ఆడిన స్మిత్ ఎక్కువ సేపు క్రీజులో నిలువగలిగాడు. అంతేకాదు లూజ్ బంతుల్ని తెలివిగా ఫోర్లుగా మలచడంలో సఫలీకృతం అయ్యాడని, అయితే ఇదే టెక్నిక్‌ను కోహ్లీ ప్రదర్శించలేకపోయాడని అంటున్నారు.
మూడో రోజు ఆటలో భాగంగా 143/4 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 285 పరుగులకు ఆలౌటైంది. తద్వారా మూడో రోజు మరో 142 పరుగులను జత చేసింది. ఆసీస్ జట్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్ (109)ని నమోదు చేశాడు. మరోవైపు మిచెల్ మార్ష్ (31), వేడ్ (20), మిచెల్ స్టార్క్ (30)లు ఫర్వాలేదనిపించారు.
ఇక భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు సాధించగా, జడేజా మూడు, ఉమేశ్ యాదవ్‌కు రెండు వికెట్లు లభించాయి. జయంత్ యాదవ్ లకు వికెట్ దక్కింది. పూణె టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకే ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా 105 పరుగులకే ఆలౌటైంది.
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 155 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్ విషయానికి వస్తే ఆసీస్ 285 పరుగులు చేయగా, భారత్ 107 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌పై ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.