న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాపై నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్ విజయాన్ని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆటగాళ్లు అజింక్యా రహనే, రవిచంద్రన్ అశ్విన్ చెన్నై వరద బాధితులకు అంకితం చేశారు. చెన్నై వరదల్లో భారత సైన్యం చేసిన సేవలను వారు కొనియాడారు.
విజయాన్ని చెన్నై వరద బాధితులకు అంకితం చేస్తున్నానని, గత కొద్ది వారాలుగా దురదృష్టకరమైన పరిస్థితి చోటు చేసుకుందని, మృతుల కుటుంబాల గురించే తన ఆలోచన సాగుతోందని విరాట్ కోహ్లీ అన్నాడు. మ్యాచ్ అనంతరం ఆయన సోమవారం ఆ మాటలన్నాడు.

తమ ఆటగాళ్లు విజయ్, అశ్విన్ కుటుంబ సభ్యులు కూడా చాలా సేపు వరదల్లో చిక్కుకున్నారని, అయినా వారు ఆటను కొనసాగించారని, అది అభినందనీయమని వారి వ్యక్తిత్వానికి నిదర్శనమని, ఈ విజయం చెన్నై ప్రజలకు కొంత సంతోషాన్నిస్తుందని తాను భావిస్తున్నానని అన్నాడు.
తన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అజింక్యా రహనే కూడా చెన్నై వరద బాధితులకు, వరద తాకిడి ప్రాంతాల్లో ప్రశంసనీయమైన సేవలు అందిస్తున్న భారత సైన్యానికి అంకితం చేశాడు. రహనే రెండు ఇన్నింగ్సుల్లోనూ సెంచరీలు సాధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.
సిరీస్‌లో 31 వికెట్లు పడగొట్టి గెలుచుకున్న మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును అశ్విన్ చెన్నై వరద బాధితులకు అంకితం ఇచ్చాడు. తాను వెళ్లి స్వయంగా చెన్నై బాధితులను ఆదుకోవాలని ఉందని అశ్విన్ అన్నాడు. తాను స్వయంగా అక్కడికి వెళ్లి సాయం చేస్తానని చెప్పాడు.