హైదరాబాద్: కోచ్‌గా తన పద్ధతులపై కెప్టెన్ కోహ్లీకి అభ్యంతరాలున్నట్లుగా బోర్డు తనకు తెలిపిన నేపథ్యంలో కోచ్ పదవికి అనిల్ కుంబ్లే మంగళవారం రాజీనామా చేశాడు. గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్టే కెప్టెన్ కోహ్లీతో విభేదాలే కుంబ్లే నిష్క్రమణకు కారణమైంది.
ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, షూటర్ అభినవ్ బింద్రా కూడా కోహ్లీకి పరోక్షంగా చురకలంటించాడు. కోహ్లీ, కుంబ్లే పేర్లను ప్రస్తావించకకుండానే, ఆటగాళ్లకు మంచి సందేశాన్నే ఇచ్చాడు.
కోచ్‌తో తన అనుభవాన్ని ట్విట్టర్‌లో బింద్రా పంచుకున్నాడు. 'నా కెరీర్‌లో మంచి గురువు అంటే కోచ్ ఉవె. అతన్ని నేను ద్వేషించేవాడిని. కానీ 20 ఏళ్లుగా అతనితోనే ఉన్నా. నేను ఏవైతే వినకూడదని అనుకున్నానో అతను అవే చెప్పేవాడు' అని బింద్రా ట్వీట్ చేశాడు.
బింద్రా చేసిన ఈ ట్వీట్ ఎంతో మంది ఆటగాళ్లకు కనువిప్పుని కలగజేసింది. కోచ్ అంటే అలాగే ఉంటాడని, అలా ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయని బింద్రా చెప్పకనే చెప్పాడు. ఇదే విషయాన్ని బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా కూడా స్పష్టం చేసింది.
'సోమవారం నేను బీసీసీఐ నుంచి ఓ సమాచారం అందుకున్నాను. ప్రధాన కోచ్‌గా కొనసాగాలంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించిన విధంగా జట్టు శిక్షణలో కొన్ని మినహాయింపులు పాటించాలని కోరింది. జట్టు కెప్టెన్‌తో గౌరవంగా మెలుగడంలో కోచ్‌గా నా పరిధి మేరకు ప్రవర్తించడం తెలుసు. అందుకే బీసీసీఐ నుంచి వచ్చిన సూచన నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కెప్టెన్‌కు నాకు మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు బీసీసీఐ పూర్తిస్థాయిలో ప్రయత్నించినా మా ఇద్దరి భాగస్వామ్యం అసంపూర్ణంగా ముగిసింది. దీంతో తప్పుకోవడమే మేలనిపించి ఈ నిర్ణయం తీసుకున్నాను' అని రాజీనామా లేఖలో కుంబ్లే పేర్కొన్నాడు.