సరిగా హ్యాండిల్ చేయలేదు: కుంబ్లే-కోహ్లీ వివాదంపై తొలిసారి గంగూలీ
హైదరాబాద్: భారత క్రికెట్‌లో సంక్షోభం సృష్టించిన అనిల్ కుంబ్లే-విరాట్ కోహ్లీల విభేదాలపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తొలిసారి స్పందించాడు. ఈ వ్యవహారంలో బీసీసీఐ కొంత పరిణతితో వ్యవహరించి ఉండే బాగుండేదనే అభిప్రాయాన్ని గంగూలీ వ్యక్తం చేశాడు.
టీమిండియా కొత్త కోచ్‌ను ఎంపిక చేసేందుకు ఏర్పాటైన క్రికెట్ సలహా కమిటీలో గంగూలీ కూడా ఓ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కుంబ్లే-కోహ్లీ వివాదంపై తొలిసారి స్పందించిన గంగూలీ ఈ వ్యవహారాన్ని బీసీసీఐ సరిగా హ్యాండిల్ చేయలేదని చెప్పాడు.

మీడియాతో మాట్లాడిన గంగూలీ
మంగళవారం గంగూలీ మీడియాతో మాట్లాడాడు. ‘కుంబ్లే-కోహ్లీ మధ్య జరిగిన వ్యవహారాన్ని మెరుగ్గా పరిష్కరిస్తే బాగుండేది. ఈ వ్యవహారంలో బీసీసీఐ సరిగ్గా వ్యవహరించలేదు' అని గంగూలీ అన్నాడు. ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం కోహ్లీతో విభేదాల కారణంగానే తన పదవికి రాజనామా చేస్తున్నట్లు కుంబ్లే పేర్కొన్న సంగతి తెలిసిందే.

కుంబ్లే రాజీనామాతో కోచ్ కోసం మళ్లీ దరఖాస్తులు
కుంబ్లే రాజీనామా అనంతరం బీసీసీఐ మళ్లీ కొత్త కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. జులై 9 వరకు అర్హులైన అభ్యర్దులు కోచ్ పదవికి దరఖాస్తులను పంపొచ్చని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతకముందు కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది.

అనూహ్యంగా తెరపైకి రవిశాస్త్రి పేరు
ఈ నేపథ్యంలో టీమిండియా కొత్త కోచ్ రేసులో రవిశాస్త్రి పేరు తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే మే 31 నాటికి గడువు ముగిసే సమయానికి కోచ్ పదవి కోసం టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్‌మూడీ, రిచర్డ్ పైబస్, లాల్‌చంద్ రాజ్‌పుత్, దొడ్డా గణేష్‌లు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

రవిశాస్త్రి దరఖాస్తు గురించి గంగూలీ ఇలా
కుంబ్లే రాజీనామా అనంతరం ప్రధాన కోచ్ పదవి రేసులో వినిపిస్తున్న మొదటి పేరు రవిశాస్త్రి. గతంలో రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో పాటు కెప్టెన్ కోహ్లీ కూడా రవిశాస్త్రికి మద్దతు తెలుపుతున్నాడు. గతంలో సీఏసీ సభ్యుడైన గంగూలీ కారణంగానే కోచ్ పదవి తనకు దక్కలేదని రవిశాస్త్రి వాపోయిన సంగతి తెలిసిందే. దీంతో కోచ్ రేసులోకి వచ్చిన రవిశాస్త్రి గురించి గంగూలీ స్పందిస్తూ ‘ఎవరైనా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరిపాలక మండలిలో లేనట్టయితే నేను కూడా దరఖాస్తు చేసుకొని ఉండేవాడిని' అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications