
హైదరాబాద్: 2017 సంవత్సరానికి అంతర్జాతీయ్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అవార్డులను ప్రకటించింది. 2017లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ అవార్డుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రతిష్టాత్మక సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అవార్డు వరించింది.
టెస్టు, వన్డే, టీ20 ఈ మూడు ఫార్మాట్లలోనూ విశేష ప్రతిభ కనబరిచిన ఆడటగాడికి ఐసీసీ ఈ అవార్డు అందజేస్తోంది. ఈ అవార్డుకి కోహ్లీ ఎంపిక కావడం ఇదే తొలిసారి. గతేడాది మూడు ఫార్మాట్లలో కూడా విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.
దీంతో పాటుగా విరాట్ కోహ్లీని ఐసీసీ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు కూడా వరించాయి. ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకోవడం విరాట్ కోహ్లీ ఇది రెండోసారి. 2012లో చేసిన ప్రదర్శనకు గాను కోహ్లీ తొలిసారి ఈ అవార్డుని దక్కించుకున్నాడు.
అలాగే ఐసీసీ ప్రకటించిన అంతర్జాతీయ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్, టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్ జట్లకు కూడా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీనే ఎంచుకుంది. ఐసీసీ ప్రకటించిన వన్డే జట్టులో కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలకు చోటు దక్కింది.
ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్:
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), రోహిత్ శర్మ (ఇండియా), విరాట్ కోహ్లీ(కెప్టెన్, ఇండియా), బాబర్ అజామ్(పాకిస్థాన్), ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), డీకాక్ (దక్షిణాఫ్రికా), బెన్‌స్టోక్స్ (ఇంగ్లాండ్), ట్రెంట్ బౌల్ట్ (ఆస్ట్రేలియా), హాసన్ అలీ (పాకిస్థాన్), రషీద్ ఖాన్ (అప్ఘనిస్థాన్), జస్ప్రీత్ బుమ్రా(ఇండియా).
అలాగే ఐసీసీ ప్రకటించిన టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్ జట్టుకు కూడా కోహ్లీనే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో కోహ్లీతో పాటు పుజారా, రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు దక్కింది. టెస్టు జట్టులో భారత్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు.
టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్:
డీన్ ఎల్గర్ (దక్షిణాఫ్రికా), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), విరాట్ కోహ్లీ (కెప్టెన్, ఇండియా), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), ఛటేశ్వర్ పుజారా (ఇండియా), బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), డీకాక్ (దక్షిణాఫ్రికా), రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), రబడ (దక్షిణాఫ్రికా), జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్).