ముంబై: ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని 1983 వరల్డ్ కప్ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. గతంలో కంటే ప్రస్తుతం ఉన్న క్రికెట్ ఆట పరంగా పూర్తిగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. గతానికి, వర్తమానానికి ఏ మాత్రం సంబంధం లేదన్నారు.
పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా గతంలో క్రికెట్ ఆట ఎలా ఉండేది...? అనే అంశంపై కపిల్ దేవ్ సుదీర్ఘంగా మాట్లాడారు. గతంలో ఆటగాళ్లు ఎన్ని ఇబ్బందులకు గురయ్యేవారు, ఆటగాళ్లకు బోర్డులు కల్పించే వసతుల గురించి కపిల్ చెప్తుంటే ఆశ్చర్య పోవాల్సిందే.
ప్రస్తుతం కెప్టెన్ చెప్తే చాలు, పిచ్‌ను ఎలా కావాలంటే అలా తయారు చేస్తున్నారు. కానీ గతంలో అలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. గ్రౌండ్ ఎలా ఉంటే అలా ఆడాల్సి వచ్చేదని.. చాలా సందర్భాల్లో ఆట మధ్యలో మంచినీళ్లు కూడా అందుబాటులో ఉండేవి కావని చెప్పుకొచ్చారు.

అంతేకాదు చాలా సందర్భాల్లో ప్లాస్టిక్ బక్కెట్లలో నీళ్లను తాము మోసుకొచ్చి.. అందుబాటులో ఉంచుకునేవాళ్లమని కపిల్ దేవ్ చెప్పుకొచ్చారు. ఇక ఆటగాళ్లు ఉపయోగించే వస్తువుల విషయంలో ఇప్పుడున్న ఆటగాళ్లు ఎంతో మెరుగ్గా ఉన్నారని అన్నారు.
గతంలో షూస్ చిరిగిపోతే.. వాటిని వదిలేసి.. వట్టి కాళ్లతోనే పరుగులు పెడుతూ బౌలింగ్ చేయాల్సి ఉండేదని కపిల్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. తన షూస్ చిరిగిపోయిన పలు సందర్భాల్లో తాను ఒట్టి కాళ్లతో పరుగులు దీస్తూ బౌలింగ్ వేశానని ఆయన చెప్పుకొచ్చారు.