
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో మనందరికీ తెలుసు. ప్రత్యర్ధులు కవ్విస్తే.. కోహ్లీ బ్యాట్‌తోనే సమాధానం చెపుతాడు. బౌలర్ కీలక వికెట్ తీసినా.. అద్భుత క్యాచ్ పట్టినా అతిగా సంబరాలు చేసుకుంటాడు. అలాంటి కోహ్లీ మైదానం బయట మాత్రం సరదాగా ఉంటాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌తో సైతం సరదాగా ఉంటాడు. ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కోహ్లీ.. ఇతర ఆటగాళ్ల పోస్టులపై కూడా సరదాగా కామెంట్లు చేస్తాడు. తాజాగా కూడా ఓ సరదా కామెంట్ చేసి వార్తల్లో నిలిచాడు.
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌కు విరాట్ కోహ్లీ స్పందించాడు. విషయంలోకి వెళితే.. డేవిడ్ వార్నర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో షేర్ చేశాడు. అందులోవార్నర్‌కు సంబందించిన 18 బ్యాట్లు ఉన్నాయి. 'స్టాక్ తీసేసే సమయం వచ్చింది' అని ఆ ఫొటోకు క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఈ పోస్టుపై కోహ్లీ స్పందించాడు. 'నా నుంచి నీకు ఇంకో బ్యాట్ అవసరమేమో' అని కోహ్లీ సరదాగా ఓ కామెంట్ ట్వీట్ చేశాడు.
కోహ్లీ పోస్టుపై వార్నర్ స్పందిస్తూ... 'కోహ్లీ.. నీకు చెప్పినట్టే నాకు ఒక్క బ్యాటే అవసరం' అని నవ్వుతున్న ఏమోజీలను పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు రెండు లక్షల మందికిపైగా లైక్ కొట్టారు. అంతేకాదు ఫాన్స్ కూడా తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'బౌలర్లు గమనించండి. వార్నర్ పరుగులు చేయకుండా ఆపడానికి ఏకైక మార్గం. ఈ బ్యాట్లలను అతని నుండి దూరం చేయండి' అని ఓ అభిమాని ట్వీట్ చేసాడు.
కోహ్లీ గతేడాది చివర్లో 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్' అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ 2019 సందర్భంగా మైదానంలో ఉన్న కొందరు ప్రేక్షకులు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను గేలి చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో కోహ్లీ సైగలు చేస్తూ వారిని అలా చేయొద్దని సూచించాడు. దీంతో ఐసీసీ గతేడాది 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్' అవార్డును ప్రకటించింది.
ఆస్ట్రేలియాతో ఇటీవలే జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. ఆసీస్ మొదటి వన్డే గెలవగా.. టీమిండియా మిగతా రెండు వన్డేలలో ఘన విజయాలు సాధించింది. వార్నర్ ఈ సిరీస్‌లో 128, 15, 3 పరుగులు చేసాడు. విరాట్ కోహ్లీ 16, 78, 89 రన్స్ చేసాడు. కోహ్లీకి 'ప్లేయర్ ది సిరీస్' దక్కింది.