
జట్టు సభ్యులతో
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా శుక్రవారం ఓటమి పాలైంది. దీంతో విరాట్ తీవ్ర నిరాశకు గురయ్యాడని సమాచారం. దీంతో ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్సీకి దూరమైన తాను ఇక టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడట. దీంతో ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటలో ఉన్న కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించడానికి 24 గంటల ముందు డ్రెస్సింగ్ రూంలో తన టీమ్ సభ్యులతోపాటు సహాయక బృందానికి చెప్పాడని సమాచారం. కోహ్లీ చెప్పింది విని వారంతా ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారట.

ద్రావిడ్‌కు మొదట సమాచారం
టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాక విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని మొదట టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు చెప్పాడట. దీంతో కోహ్లీ నిర్ణయం పట్ల ద్రావిడ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం శనివారం మధ్యాహ్నం బీసీసీఐ సెక్రటరీ జైషాకు తాను టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్ల ఫోన్ చేసి చెప్పాడట. దీంతో ఇక జైషా కూడా కోహ్లీ రాజీనామాకు సరే అన్నాడని సమాచారం. దీంతో శనివారం రాత్రి కాబోయే సమయంలో విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా తాను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

స్పందించిన బీసీసీఐ
టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించిన కొద్ది సేపటికే బీసీసీఐ స్పందించింది. విరాట్ కోహ్లీ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఇంత కాలం భారత జట్టుకు కెప్టెన్‌గా సేవలందించినందుకుగాను ధన్యావాదాలు తెలిపింది. ఈ సందర్భంగా టెస్టు క్రికెట్లో కోహ్లీ సాధించిన రికార్డులను బోర్డు గుర్తు చేసింది. 68 టెస్టు మ్యాచ్‌ల్లో భారత్‌కు 40 విజయాలు అందించిన అత్యంత విజయవంతమైన కెప్టెన్ అంటూ ప్రశంసించింది.

స్పందించిన గంగూలీ, రోహిత్
అలాగే బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కోహ్లీ రాజీనామాపై స్పందించారు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం కోహ్లీ వ్యక్తిగత అంశమని, అయితే అతని నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుందని గంగూలీ ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా అద్బుత విజయాలు సాధించిందని కొనియాడిన దాదా, భవిష్యత్‌లో భారత జట్టు ఉన్నత శిఖరాలను చేరుకోవడంలో విరాట్ కీలక పాత్ర పోషిస్తాడని ఆశించాడు. అలాగే కోహ్లీ నిర్ణయం విని షాక్‌కు గురయ్యానని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. కోహ్లీ విజయవంతమైన కెప్టెన్ అని కొనియాడిన రోహిత్ .. అతనికి అభినందనలు తెలిపాడు.