
హైదరాబాద్: భయమనేదే లేకుండా ఇంగ్లాండ్ గడ్డపై రాణిస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మంగళవారం జరగనున్న భారత్-ఇంగ్లాండ్‌ల టీ20కు ఇరు జట్లు తీవ్రంగా ప్రాక్టీసులో పాల్గొంటున్నాయి. పర్యటనలో ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా.. కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.
'చాలా ప్రశాంతంగా, మంచి సమయాన్ని గడుపుతున్నాం. ఆతిథ్య జట్టుకు గట్టి పోటీ ఇచ్చేలా ఆడాలని అనుకుంటున్నాం. ఇంగ్లాండ్ గడ్డపైనే ఇంగ్లాండ్ జట్టును ఓడించేందుకు సమయం వచ్చింది. 2016-17 సీజన్‌లో ఇంగ్లాండ్.. భారత్‌లో పర్యటించింది. అప్పుడు మనం ట్రోఫీ గెలిచాం. ఇప్పుడు మనం వారి గడ్డపై పర్యటిస్తున్నాం. ఇప్పుడు వారు గెలవాలని భావిస్తున్నారు. కాబట్టి సమష్టిగా భయంలేని క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాం'
'బట్లర్ ఫామ్ చూసి ఆశ్చర్యపోవడంలేదు. అతడికి ఇప్పుడు ఆడేందుకు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. టాప్ ఆర్డర్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నాడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. క్రిస్ వోగ్స్, మొయిన్ అలీ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడారు. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ గడ్డపై కౌంటీ క్రికెట్ ఆడుతోన్న ఛతేశ్వర పూజారా, ఇషాంత్ శర్మతో ఇప్పటికే మాట్లాడాం. ఇక్కడి పిచ్, పరిస్థితుల గురించి చర్చించాం. ఇవన్నీ మాకు కలిసొచ్చే అంశాలే' అని కోహ్లీ వివరించాడు.
'విదేశీ పర్యటనల కోసం ఆసక్తితో ఎదురుచూస్తాం. ముఖ్యంగా ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుతో, వారి సొంతగడ్డపై ఆడే సమయంలో మనం ఏంటో నిరూపించుకునే అవకాశం దొరుకుతుంది. అంతేకాదు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో.. జట్టు సభ్యుల ఆటతీరును కూడా పరీక్షించొచ్చు. ఇదే గడ్డపై ఆడాల్సి ఉన్న ప్రపంచకప్‌కు.. ముందుగానే ఇంగ్లాండ్‌లో జరగనున్న ఈ సుదీర్ఘ పర్యటన భారత జట్టుకు ఎంతో కలిసొస్తుంది' అని కోహ్లీ నమ్మకం వ్యక్తం చేశాడు.