హైదరాబాద్: శ్రీలంకతో ఆదివారం ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో రాణించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐసీసీ సోమవారం వన్డే ర్యాంకుల జాబితాను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు.
శ్రీలంకతో జరిగిన వన్డే సిరిస్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించడంతో 887 పాయింట్లతో కోహ్లీ అగ్రస్ధానంలో నిలిచాడు. తద్వారా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అత్యధిక రేటింగ్ పాయింట్ల రికార్డును సమం చేశాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ ఒక్కడే భారత్ తరుపున 887 రేటింగ్ పాయింట్లను సాధించాడు.
1998లో సచిన్ టెండూల్కర్ ఈ అరుదైన ఘనత సాధించారు. శ్రీలంకతో వన్డే సిరిస్ ముగిసిన తర్వాత కోహ్లీ తన ఖాతాలో 14 పాయింట్లను వేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో కోహ్లీ వరుసగా రెండు సెంచరీలు సాధించి... వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రికీ పాంటింగ్(30)తో కలిసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ 861 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ (847), ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (799), పాక్ ఓపెనర్ బాబర్ అజామ్ (786)లు ఉన్నారు. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ తొమ్మిదో స్థానంలో ఉండగా, మార్టిన్ గప్టిల్‌తో కలిసి ధోని సంయుక్తంగా పదో ర్యాంకులో కొనసాగుతున్నాడు.
ఈ సిరీస్‌లో మొత్తం 15 వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచిన జస్‌ప్రీత్ బుమ్రా ఏకంగా 27 స్థానాలు ఎగబాకి కెరీర్‌లోనే బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. 687 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా పేసర్ హేజిల్ వుడ్ (732) అగ్రస్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా స్పిన్నర్ తాహిర్ (718), ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ (701), దక్షిణాఫ్రికా బౌలర్ రబాడ (685) వరుసగా ఉన్నారు.
ఇక జట్ల పరంగా భారత్ 117 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, శ్రీలంక 86 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. సెప్టెంబరు చివరి వరకు టాప్-8లో ఉన్న జట్లే 2019 ప్రపంచకప్‌కి నేరుగా అర్హత సాధించే విషయం తెలిసిందే.