
హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధికసార్లు 150 పరుగులు సాధించిన కెప్టెన్‌గా క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్(8 సెంచరీలు) సరసన కోహ్లీ నిలిచాడు.
దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. టెస్టుల్లో అత్యధికసార్లు 150కి పైగా పరుగులు సాధించిన కెప్టెన్ల జాబితాలో ఏడేసి సెంచరీలతో మైకేల్ క్లార్క్(ఆస్ట్రేలియా), జయవర్దనే(శ్రీలంక), బ్రియాన్ లారా(వెస్టిండీస్), గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) ఉన్నారు.
అంతేకాదు సఫారీ గడ్డపై ఆసియా దేశాలకు చెందిన కెప్టెన్ సెంచరీ చేయటం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో సచిన్ టెండూల్కర్(1997 కెప్‌టౌన్ టెస్టులో 169పరుగులు) ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే టెస్టుల్లో విరాట్ కోహ్లీ 150 పరుగులు సాధించటం ఇది తొమ్మిదోసారి.
రెండో టెస్టు మూడో రోజైన సోమవారం దూకుడుగా ఆడిన కోహ్లి 153 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఓవైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ మాత్రం నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో తన టెస్టు కెరీర్‌లో 21 సెంచరీని సాధించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా సాధించిన మొత్తం 307 పరుగుల్లో కోహ్లీ పరుగులే సగం ఉండటం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 335 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 90 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.