ఢాకా: బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య గురువారం జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కీపర్ బాధ్యతలను తీసుకున్నాడు. టీమిండియా వన్డే కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని కొన్ని అనివార్య కారణాల వల్ల షేర్ ఏ బంగ్లా జాతీయ మైదానం నుంచి బయటకు వెళ్లాడు.
దీంతో టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన చేతులకు గ్లౌజ్ ధరించి ఉమేశ్ యాదవ్ వేసిన 44వ ఓవర్‌లో వికెట్ కీపింగ్ చేశాడు. ఈ సమయంలో బంగ్లాదేశ్ ఐదు వికెట్లను నష్టపోయి 264 పరుగులు చేసింది.

మైదానంలో ఎప్పుడైతే ధోని ఫ్యాడ్లు, గ్లోజ్స్ తీశాడో అందరూ బౌలింగ్ వేస్తాడని ఊహించారు. కానీ అలా జరగలేదు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో గతంలో బౌలింగ్ వేసిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో కూడా బౌలింగ్ వేసి అభిమానులను అలరించాడు.
వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కేవలం ఒకే ఒక్క ఓవర్‌కు గాను బ్రేక్ తీసుకున్నాడు. ఈ సమయంలో అటు కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా మైదానంలో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ధోని మైదానం నుంచి బయటకు వెళ్లడంతో అంబటి రాయుడు ఫీల్డింగ్ చేసేందుకు వచ్చాడు.