కింగ్‌స్టన్: గెలుపు లాంఛనమే అనుకున్న రెండో టెస్ట్ మ్యాచ్ చేజారడం టీమిండియా కెప్టెన్ కోహ్లీని తీవ్ర అసంతపృప్తికి గురిచేసింది. అయితే, టీమిండియా కోచ్ మాత్రం విండీస్ ఆటగాళ్లను మెచ్చుకున్నాడు. విండీస్‌ను భారీ ఓటమి నుంచి తప్పించారని కొనియాడాడు. ఛేజ్ తన జట్టు కోసం భారీ ఇన్నింగ్స్ చేసి అద్భుత ప్రతిభను చాటుకున్నాడని అన్నాడు.
కోహ్లీకి నిరాశ: బతికిపోయిన విండీస్, రెండో టెస్ట్ డ్రా
'ఇది మమ్మల్ని పరీక్షించిన రోజు. అయితే టెస్టు క్రికెట్‌లో ఇవన్నీ సహజం. మంగళవారం వర్షం కారణంగా ఎక్కువ సేపు ఆట సాధ్యం కాకపోవడం భారత్ విజయావకాశాల్ని దెబ్బతీసింది. తొలి టెస్టులో ఓడిన వెస్టిండీస్ రెండో టెస్టులో పుంజుకుని మ్యాచ్‌ను రక్షించుకునేందుకు చాలా శ్రమించింది' అని కోహ్లీ పేర్కొన్నాడు.

48/4తో ఐదో రోజైన బుధవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్.. రోస్టన్ ఛేజ్ (137) అజేయ శతకం బాదడంతో ఆట ముగిసే సమయానికి 388/6తో నిలిచి మ్యాచ్‌ను డ్రాగా ముగించిన విషయం తెలిసిందే.
కాగా, శనివారం ఆరంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 196 పరుగులకు ఆలౌటవగా.. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 500/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులు వెనకబడ్డ విండీస్ నాలుగో రోజైన మంగళవారం 15.5 ఓవర్లలోనే రెండో ఇన్నింగ్స్‌లో 48/4తో కష్టాల్లో నిలిచింది.
వర్షం కారణంగా ఆట ఆ రోజు 15.5 ఓవర్లే సాధ్యమైంది. ఒకవేళ వర్షం అడ్డంకి లేకుంటే అప్పటికే ఒత్తిడిలో ఉన్న వెస్టిండీస్‌ను ఆలౌట్ చేసేందుకు భారత్ బౌలర్లకు అవకాశాలు పుష్కలంగా ఉన్నా వారు సఫలీకృతులు కాలేకపోయారు.