కాన్పూర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న చరిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్‌లో ఆదివారం ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఇప్పుడు వైరల్‌గా మారిన ఆ వీడియో అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది.
ఓవర్‌నైట్ స్కోరు 159/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ టీ విరామ సమయానికి కొద్ది నిమిషాల ముందు 377/5తో భారీ ఆధిక్యం దిశలో ఉంది. ఇదే దశలో రవీంద్ర జడేజా (50: 58 బంతుల్లో 2×4, 3×6) కూడా అర్ధశతకం పూర్తి కావడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.

అయితే అప్పటికే అర్ధశతకం ఆనందంలో జడేజా బ్యాట్‌ను కత్తిలా మైదానంలో తిప్పుతూ సంబరాలు చేసుకుంటూ ఉండటాన్ని గమనించిన కోహ్లీ నవ్వుతూ.. అలానే పెవిలియన్‌కు రమ్మని సైగ చేశాడు.
జడేజా అలాగే కత్తిలా బ్యాట్‌ను ఊపుతూ పెవిలియన్ చేరుకున్నాడు. కాగా, రాజ్‌పుత్ వంశానికి చెందిన జడేజాకు కత్తితో తిప్పడం మంచి ప్రావీణ్యం ఉంది. కత్తి తిప్పడంలో తన ప్రతిభను అభిమానులకు పలుమార్లు చూపించాడు కూడా.