ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డులను బ్రేక్ చేసేది విరాట్ కోహ్లీయేనని ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీలో ఉన్న ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ అతడికి చాలా ప్రత్యేకమని చెప్పారు. ఇప్పటి వరకు అతని బ్యాటింగ్ శైలిలో లోపాలు చూడలేదన్నారు.
ట్వంటీ 20 ప్రపంచ కప్, ఐపీఎల్‌లో కోహ్లి రాణించిన తీరు అద్భుతమని చెప్పారు. భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లిలా నిలకడగా రాణించిన ఆటగాళ్లు తక్కువ అని చెప్పారు. భవిష్యత్‌లో ఇలానే నిలకడగా రాణిస్తే సచిన్ రికార్డులను సునాయాసంగా అధిగమిస్తాడని చెప్పాడు.

కోహ్లీ కెప్టెన్సీలో ధోనీ!
ఓ ఫుట్‌బాల్ మ్యాచులో.. కోహ్లీ కెప్టెన్సీలో ధోనీ ఆడనున్నాడు. విరాట్ ఫౌండేషన్‌కు విరాళాలు సేకరించే ఉద్దేశ్యంతో క్రికెటర్లంతా బాలీవుడ్ స్టార్లతో తలపడబోతున్నారు. అభిషేక్ బచ్చన్ ఫ్లేయింగ్ ఫర్ హ్యూమనిటీతో చేతులు కలిపిన కోహ్లీకి చెందిన విరాట్ ఫౌండేషన్.. ఈ మ్యాచ్ నిర్వహిస్తోంది.
ఈ నెల 4న ముంబైలో ఈ మ్యాచ్ జరగబోతోంది. కోహ్లి జట్టులో ధోనీతోపాటు జహీర్ , హర్భజన్, యువరాజ్, రహానే, అశ్విన్ ఆడుతున్నారు. అభిషేక్ బచ్చన్ జట్టులో రణబీర్ కపూర్, అర్జున్ కపూర్, ఆదిత్యరాయ్ కపూర్‌లాంటి స్టార్లు ఉన్నారు. ఈ చారిటీ మ్యాచ్‌కు సెలబ్రిటీ క్లాసికో 2016 అని పేరు పెట్టారు. ఈ మ్యాచ్ ద్వారా సేకరించిన విరాళాలను విరాట్ కోహ్లి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు.