
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ విసిరిన ఛాలెంజ్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వీకరించాడు. మూడు రోజుల క్రితం సచిన్ 'కిట్ అప్ ఇండియా' పేరిట ఓ ఛాలెంజ్‌ని విసిరిన సంగతి తెలిసిందే. "నేను నాకు ఇష్టమైన క్రికెట్ ఆడి వీడియోను షేర్ చేశాను. మీరు మీకిష్టమైన ఆట ఆడి మీరు మీ వీడియోలను షేర్ చేయండి. మీరందరు ఎప్పుడు ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాను" అని సచిన్ కామెంట్ పెట్టారు.
'నాకు ఇష్టమైన ఆట ఆడేందుకు ఇలా సిద్ధమౌతున్నాను' అని సచిన్ తాను క్రికెట్ ఆడేందుకు కాళ్లకు, చేతులకు ప్యాడ్లు, హెల్మెట్, గ్లౌజులు ధరించుకుని బ్యాట్ పట్టుకున్న వీడియోని అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. తాను క్రికెట్ ఆడుతోన్న వీడియోను షేర్ చేయడంతోపాటు భారత క్రీడాకారులు సర్దార్ సింగ్, పీవీ సింధు, మిథాలీ రాజ్, విజేందర్ సింగ్, కిదాంబి శ్రీకాంత్, విరాట్ కోహ్లీ పేర్లను ట్యాగ్ చేస్తూ ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరాడు.
అంతేకాదు వారు మరికర్ని నామినేట్ చేయాలని సూచించాడు. తాజాగా సచిన్ విసిరిన ఈ సవాల్‌ను కోహ్లీ స్వీకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు. కోహ్లీ ఈ వీడియోలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కిట్‌ను ధరించాడు. ఎరుపురంగు కాలి ప్యాడ్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడే సమయంలో వాడే హెల్మెట్‌ను కోహ్లీ పెట్టుకున్నాడు.
తదుపరి పార్దీవ్ పటేల్ ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరాడు. ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా యుకే పర్యటనలో ఉంది. ఐర్లాండ్‌లో కోహ్లీ సేన పర్యటన ముగిసింది. జులై 3 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఆ తర్వాత వన్డే, టెస్టు సిరీస్‌లు జరగనున్నాయి.
మరోవైపు సచిన్ టెండూల్కర్ ఛాలెంజ్‌ని పీవీ సింధు కూడా స్వీకరించింది. బ్యాడ్మింటన్ ఆడుతోన్న వీడియోని సింధు తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా మేరీకోమ్, తమిళ హీరో సూర్య, రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరింది.