
హైదరాబాద్: బిగ్ బాష్ లీగ్‌లో మైకేల్ క్లింగర్ ఆడటం అనుమానంగా మారింది. ఎందుకంటే అతడి భార్య సిండీకి రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అతడు ఇకపై బిగ్ బాష్ లీగ్‌లో ఆడతాడా లేదా అన్న దానిపై సందిగ్థత నెలకొంది.
36 ఏళ్ల వయసులో క్లింగర్ ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియా తరుపున అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. ఇక, బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ షాకర్స్ జట్టు తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది జరిగన ఫైనల్లో పెర్త్ షాకర్స్ జట్టుకు మూడో టైటిల్ అందించడంలో క్లింగర్ కీలకపాత్ర పోషించాడు.
తాజాగా బుధవారం క్లింగర్ భార్య రొమ్ము కేన్సర్ గురించి పెర్త్ షాకర్స్ జట్టు బహిరంగ లేఖను విడుదల చేసింది. అందులో క్లింగర్ 'ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితుల్లో క్రికెట్ ఆడటం సెకండరీ. అయితే నా భార్య మాత్రం నన్ను క్రికెట్ ఆడమని ప్రోత్సహిస్తుంది. నా పిల్లలు మైదానంలో లేదా టీవీల్లో నన్ను చూసే వీలుంటుంది. దాని వల్ల వేరే దానిపైకి ఏకాగ్రతా మరలుతుంది' అని పేర్కొన్నాడు.
'తన ఛాయిస్ మాత్రం వేరు. సిండీ అపాయింట్ మెంట్స్ లేదా ట్రీట్ మెంట్ కోసం నా క్రికెట్ మ్యాచ్‌లు అడ్డుపడకూడదు. పిల్లలు కూడా నన్ను మిస్సవుతారు. నేను వారి పక్కనే ఉండాలని అనుకుంటున్నా' అని క్లింగర్ ఆ లెటర్‌లో పేర్కొన్నాడు. సిడ్నీ సిక్సర్స్‌తో శనివారం జరగనున్న మ్యాచ్ కోసం పెర్త్ షాకర్స్ ఇప్పటికే క్యాంపెయిన్ ప్రారంభించింది.
పెర్త్ షాకర్స్ కోచ్ జస్టిన్ లాంగర్ పెర్త్ నౌతో మాట్లాడుతూ 'ప్రస్తుతం క్లింగర్ ఉన్న పరిస్థితుల్లో ఇదే సరైన నిర్ణయం. ఫ్యామిలీ అనేది మనకు మొట్టమొదటి ప్రయారిటీ. అతడు ఆడేందుకు సిద్ధంగా ఉంటే... మా వైపు నుంచి మేం ఎప్పటికీ సిద్ధమే' అని పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.