KL Rahul: చెన్నై సూపర్ కింగ్స్‌పై 51 బంతుల్లో 77 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ క్యాపిటల్స్‌ను 25 పరుగుల తేడాతో విజయం వైపు నడిపించిన వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ కీలక ప్రకటన చేశాడు. భారత జట్టు అసిస్టెండ్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి చేసిన కృషి వల్లే తాను వైట్ బాల్ క్రికెట్‌ను మళ్లీ ఆస్వాదించానని కేఎల్ రాహుల్ అన్నాడు.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఫాఫ్ డుప్లెసిస్ అందుబాటులో లేకపోవడంతో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా నిలిచాడు. ప్రారంభంలో కేఎల్ రాహుల్ 20 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత దూకుడు పెంచి తదుపరి 18 బంతుల్లో 36 పరుగులు చేశాడు. మొత్తం మీద 51 బంతుల్లో 77 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ సీఎస్కే కీలక బౌలర్ అయిన నూర్ అహ్మద్ బౌలింగ్ లో కూడా స్వేచ్ఛగా స్కోరు చేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్లు కోల్పోయి 183 పరుగులు సాధించగలిగింది.

అభిషేక్ నాయర్ గురించి కేఎల్ రాహుల్ ఏమన్నారంటే?
మ్యాచ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్ కెవిన్ పీటరన్స్‌తో కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. "గత ఒక సంవత్సరం పాటు నేను వైట్ బాల్ క్రికెట్‌లో చాలా కష్టపడ్డాను. నా విజయానికి భారత జట్టు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కారణం. అభిషేక్ నాయర్ వచ్చినప్పటి నుంచి నేను అతనితో గంటల తరబడి వైట్ బాల్ క్రికెట్‌లో ఎలా మెరుగుపడాలి. మళ్లీ ఎలా ఆస్వాదించాలని అనే దాని గురించి నేర్చుకున్నాను. మేము ముంబైలో గంటల తరబడి కలిసి ప్రాక్టీస్ చేశాం. అక్కడే నేను మళ్లీ ఆడటంలో నిజమైన ఆనందాన్ని పొందాను." అని కేఎల్ రాహుల్ చెప్పాడు
రాహుల్ ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ ఆడలేదు..
పితృత్వ సెలవు కారణంగా కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి మ్యాచ్‌లో పాల్గొనలేదు. కేఎల్ రాహుల్ దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది. కేఎల్ రాహుల్ తిరిగి వచ్చిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 5 బంతుల్లో 15 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత సీఎస్కేపై అద్భుతంగా రాణించాడు. కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. "మ్యాచ్ మధ్యలో నేను 15-20 పరుగులు వెనకబడి ఉన్నట్లు అనిపించింది. కానీ మంచి విషయం ఏంటంటే ముందున్న జట్టు కూడా నాలాగే కష్టపడుతోంది. విరామం తర్వాత మళ్లీ బ్యాటింగ్ ప్రారంభించిన వెంటనే మొదటి బంతి మిడిల్ కి తగిలింది. ఆ తర్వాత నేను దూకుడుగా ఆడాను." అని కేఎల్ రాహుల్ చెప్పాడు.
క్రికెట్ మారిపోయింది..
ఇప్పుడు ఆట పట్ల తన విధానం మారిందని కేఎల్ రాహుల్ అన్నాడు. కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. "కొన్నిసార్లు నేను ఆటను పొడిగించడం గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని. ఫోర్లు, సిక్సర్లు కొట్టే ఆనందాన్ని కోల్పోయాను. కానీ ఇప్పుడు క్రికెట్ మారిపోయిందని అర్థమైంది. ముఖ్యంగా టీ20 క్రికెట్ మారిపోయింది. అందులో ఎక్కువ ఫోర్లు, సిక్సర్లు కొట్టిన జట్టు గెలుస్తుంది. ఇప్పుడు నేను పెద్దగా ఆలోచించను. బంతిని చూస్తూ దూకుడుగా ఆడటానికి ప్రయత్నిస్తాను. బౌలర్‌పై, ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచి క్రికెట్‌ను ఆస్వాదిస్తాను" అని కేఎల్ రాహుల్ అన్నాడు.