KL Rahul vs Lucknow Super Giants: ఇటీవల ముగిసి అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ విజయంలో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. కఠినమైన ఇంగ్లండ్ పిచ్‌లపై కేఎల్ రాహుల్ 53.20 సగటుతో ఏకంగా 532 పరుగులు చేసి సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అయితే కేఎల్ రాహుల్ మాజీ ఐపీఎల్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది.
లక్నో సూపర్ జెయింట్స్ తమ సోషల్ మీడియాలో భారత జట్టు విజయాన్ని అభిందిస్తూ ఒక ఫోటో కొల్లాజ్‌ను పోస్ట్ చేసింది. అందులో శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ చిత్రాలు ఉన్నాయి. అయితే జట్టులో ప్రస్తుతం ఉన్న రిషబ్ పంత్, ఆకాష్ దీప్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ అత్యుత్తమ ప్రదర్శన చేసిన కేఎల్ రాహుల్ ఫోటోను మాత్రం పూర్తిగా విస్మరించారు.

అభిమానులతో పాటు మాజీ క్రికెటర్ ఆగ్రహం
సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచిన కేఎల్ రాహుల్ ఫోటో లేకపోవడాన్ని అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కేవలం ఒక పొరపాటు కాదని, కావాలనే చేసిన అవమానం అని ఆరోపిస్తున్నారు. మాజీ భారత ఫాస్ట్ బౌలర్ డోడా గణేష్ ఈ విషయంపై స్పందిస్తూ తన ఎక్స్ ఖాతాలో లక్నో పోస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇది చాలా అసహ్యంగా ఉంది. కొత్త బంతిని ఎదుర్కొని 500+ పరుగులు సాధించిన ఓపెనర్ ఫోటో మీకు దొరకలేదా?" అని ప్రశ్నించారు. అభిమానులు కూడా "ఇది అసహ్యకరమైన చర్య", "వారు రాహుల్‌ను కావాలనే అవమానించారు", "లక్నో జట్టుకు ఇదే స్వభావం" అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.
వివాదం వెనుక ఉన్న నేపథ్యం ఇదే..
ఈ వివాదం వెనుక లక్నో జట్టు, కేఎల్ రాహుల్ మధ్య గతంలో జరిగిన సంఘటనలే ప్రధాన కారణం. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మొదటి కెప్టెన్‌గా రాహుల్ వ్యవహరించారు. కేఎల్ రాహుల్ సారథ్యంలో జట్టు రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. 2024 ఐపీఎల్ సీజన్‌లో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలోనే రాహుల్‌తో బహిరంగంగా వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటన పెద్ద వివాదానికి దారితీసింది. ఆ సీజన్ తర్వాత లక్నో జట్టు రాహుల్‌ను విడుదల చేసింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రూ.14 కోట్లకు మారగా, లక్నో జట్టు రిషబ్ పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసి అతన్ని కొత్త కెప్టెన్‌గా నియమించింది.
ఈ నేపథ్యం కారణంగానే, ఇంగ్లాండ్‌లో కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేసినా అతని మాజీ జట్టు ఇలా వ్యవహరించడం, వారిద్దరి మధ్య విభేదాలు ఇంకా తొలగిపోలేదని స్పష్టం చేస్తోందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.