లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై వేటు తథ్యమని టీమిండియా సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా పేర్కొన్నాడు. రాహుల్ కెప్టెన్సీపై లక్నో ఫ్రాంచైజీ అసంతృప్తితో ఉందని తెలిపాడు. ఐపీఎల్‌లో లక్నో తరఫునే ఆడుతున్న అమిత్ మిశ్రా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చర్చనీయాంశమైన వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్‌పై ఆ ఫ్రాంజైజీ యజమాని సంజీవ్ గోయెంకా కోపం వ్యక్తం చేయడంలో తప్పు లేదంటూ సమర్థించాడు.
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఘోరపరాజయం చవిచూడటంతో అందరి ముందే కేఎల్ రాహుల్‌ను సంజీవ్ గోయెంకా అవమానించిన సంగతి తెలిసిందే. స్టేడియంలో అభిమానులు, కెమెరాల ముందే రాహుల్ ఓటమిపై మండిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సంజీవ్ చేసింది ఘోరమైన తప్పిదం అని భారత మాజీ క్రికెటర్లు సైతం స్పందించారు. ఓటమిపై సీరియస్ అవ్వాలంటే రూమ్‌లో చేయాలి కానీ, పబ్లిక్‌లో ఏంటని ప్రశ్నించారు.

కానీ అమిత్ మిశ్రా మాత్రం యజమాని సంజీవ్ గోయెంకా దృక్కోణంలో ఆలోచించి ఆ పని సరైనదే అన్నాడు. డబ్బు వెచ్చించిన యజమానికి ఆ మాత్రం కోపం వస్తుందని అభిప్రాయపడ్డాడు. ''గోయెంకా నిరాశచెందాడు. మేం వరుస మ్యాచ్‌లు ఘోరంగా ఓడాం. కేకేఆర్‌తో 90-100 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యాం. అలాగే సన్‌రైజర్స్ చేతిలో 10 ఓవర్ల లోపే చిత్తుగా ఓడాం. నెట్స్ ప్రాక్టీస్ సెషన్ తరహాలో మా జట్టు బౌలింగ్ చేసింది. నాకే ఇంత కోపం వస్తే, డబ్బులు పెట్టిన వ్యక్తికి కోపం రాకుండా ఉంటుందా?''
''ఇది పెద్ద విషయం కాదు. బౌలింగ్ పేలవంగా ఉందని, జట్టు మరింత పోరాడాల్సిందని రాహుల్‌తో గోయెంకా అన్నాడని నాకు తర్వాత తెలిసింది. పోరాటపటిమ లేకుండా ఓటమి అంగీకరించారని అతను అన్నాడు. అయితే దీని గురించి మీడియా, ప్రజలు కొంచెం హైప్ ఇచ్చారని భావిస్తున్నా'' అని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు. రాహుల్ కంటే కాస్త మెరుగైన సారథిని ఎంపిక చేయాలని లక్నో ఫ్రాంచైజీ భావిస్తుందని మిశ్రా అన్నాడు. కెప్టెన్సీకి రాహుల్ సరైనోడు కాదని అభిప్రాయపడ్డాడు.
''టీమిండియాలో కేఎల్ రాహుల్ ఉన్నాడా లేదా అనేది విషయం కాదు. టీ20లకు సరైనోడుగా కెప్టెన్ ఉన్నాడా లేదా అనేది ముఖ్యం. జట్టు కోసం పోరాడే వ్యక్తిని సారథిగా చేయాలి. రాహుల్ కంటే మెరుగైన కెప్టెన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ కచ్చితంగా వెతుకుతుందని భావిస్తున్నాను'' అని అమిత్ మిశ్రా అన్నాడు. ఐపీఎల్-2024లో అమిత్ మిశ్రాకు కెప్టెన్ రాహుల్ తుదిజట్టులో ఒక్కమ్యాచ్‌లోనే అవకాశం ఇచ్చాడు.